కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అమ్మ ఆకలి చూస్తుంది..వ్యవసాయంతో పది మందిని బతికించేది కమ్మ కులం
వారిని గుర్తించేందుకు కష్టపడనవసరం లేదు
సారవంతమైన భూమి, సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు
కమ్మ సోదరులు తమ డీఎన్‌ఏ వదులుకోకుండా ముందుకు సాగాలన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘కమ్మ అంటే అమ్మ లాంటి ఆలోచన. అమ్మ బిడ్డ ఆకలి చూస్తుంది. అలాగే భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసి పది మందిని బతికించే కులం కమ్మ. కమ్మ వారు ఎక్కడున్నారో గుర్తించేందుకు కష్టపడనవసరం లేదు. సారవంతమైన భూమి, సాగునీరు ఎక్కడ ఉంటే అక్కడ కమ్మ సోదరులు ఉంటారు.. కష్టపడాలనే మనస్తత్వం కమ్మ వాళ్లది.
సమాజ శ్రేయస్సు కోసం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు చేసే కృషికి ప్రభుత్వం తగిన సహకారాన్ని అందిస్తుంది. పది మందికి సాయం చేయాలనే ఆలోచన ఉన్న కమ్మ సోదరులు తమ డీఎన్‌ఏను వదులుకోకుండా ముందుకు సాగాలి..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగే కమ్మ గ్లోబల్ సమిట్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు.
రాజకీయాల్లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్
‘కమ్మ సామాజిక వర్గం వారితో నాకున్న సంబంధాల గురించి చెప్పనవసరం లేదు. నన్నెంతో అభిమానంతో చూసుకుంటుంది. నేను అనర్గళంగా మాట్లాడడానికి, తక్షణమే స్పందించడానికి ఎన్టీఆర్ లైబ్రరీలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగపడింది. ఎన్టీఆర్ రాజకీయాల్లో, నాయకత్వంలో ఒక బ్రాండ్ (ఎన్‌టీఆర్ ఈజ్ ఏ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, బ్రాండ్ ఫర్ లీడర్‌షిప్). 1982 కన్నా ముందు కమ్మ ఎమ్మెల్యేలు ఎందరు ఉన్నా, ఎన్టీఆర్ ఇచి్చన అవకాశాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎందరో నాయకులుగా ఎదిగారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశానికి మార్గదర్శకం..’రేవంత్ అని అన్నారు.
గ్లోబల్ సిటీగా మార్చడానికి కృషి చేయాలి
‘కమ్మ సామాజిక వర్గం వాళ్లు అన్ని రంగాల్లో ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్‌జీ రంగా, వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు వంటి వాళ్లు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సత్య నాదెళ్ల మొదలు ఎందరో ప్రపంచస్థాయి సీఈవోలుగా రాణిస్తున్నారు. కమ్మ సోదరులకు అవకాశాలు కలి్పంచడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. సొంత కులం పట్ల అభిమానం ఉంది. అదే సమయంలో ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణలో కుల వివక్ష ఉండదు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడానికి దేశ, విదేశాల్లో ఉన్న కమ్మ సోదరులు కృషి చేయాలి. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి. అందుకోసం కృషి చేయాలి..’సీఎం కోరారు.
ఢిల్లీలో తెలుగువాళ్ల నాయకత్వ కొరత
‘ఢిల్లీలో తెలుగువాళ్ల రాజకీయ నాయకత్వం కొరత ఉంది. జైపాల్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్ వంటి వాళ్లు ఢిల్లీ రాజకీయాల్లో ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగువారు ఢిల్లీలో రాణించేలా ముందుకు రావాలి. కమ్మ సంఘానికి గత ప్రభుత్వం ఇచి్చన ఐదెకరాల స్థలానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించి, భవన నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
కాగా తమది దార్శనికతతో కూడిన సామాజిక వర్గమని కేజీఎఫ్ అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ అన్నారు. కమ్మ వారి దాతృత్వానికి నాగార్జున సాగర్ ఉదాహరణ అని, ముత్యాలరాజా 57 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, తమిళనాడు ఎంపీ కళానిధి వీరాస్వామి, కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు, మాజీ ఎంపీ మురళీమోహన్, తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, సత్యవాణి ప్రసంగించారు.
రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్‌రావు, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు వసంత నాగేశ్వర్‌రావు, వడ్డే శోభనాద్రీశ్వర్ రావు, క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment