19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు
అమెరికాలో సీఎం రేవంత్ బృందం పర్యటన ముగింపు
దక్షిణ కొరియాకు బయలుదేరిన రాష్ట్ర ప్రతినిధి బృందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం అమెరికాలో చేపట్టిన పర్యటన ముగిసింది. ఈ నెల 3న అమెరికా వెళ్లిన సీఎం బృందం.. అక్కడి నుంచి దక్షిణకొరియాకు బయలుదేరింది. అమెరికా పర్యటనలో భాగంగా వివిధ రంగాల్లో పేరొందిన దిగ్గజ కంపెనీలు తెలంగాణలో రూ.31,532 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు 19 కంపెనీలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని.. తద్వారా రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను, 4.0 నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న సీఎం చేసిన ప్రకటనలతో అమెరికా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ఆసక్తి చూపారని వెల్లడించాయి.
50కి పైగా వాణిజ్య సమావేశాలతో..
అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బృందం 50కిపైగా వాణిజ్య సమావేశాలు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. కృత్రిమ మేధ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దిగ్గజ సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్‌జెన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్‌కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణ, కొత్త కేంద్రాల స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించాయి. ఈ పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం రేవంత్ బృందం చర్చలు జరిపింది.
సరికొత్త భాగస్వామ్యానికి నాంది
ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికింది. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ఏఐ సిటీ మొదలు ఫ్యూచర్ సిటీ వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావటం శుభసూచకం. – సీఎం రేవంత్
సరికొత్తగా తెలంగాణ పరిచయం
అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణను సరికొత్తగా పరిచయం చేయగలిగాం. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే సహకారాన్ని ఈ పర్యటనలో చాటిచెప్పాం. మా అమెరికా పర్యటన సత్ఫలితాలను అందించింది. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా రావడంతోపాటు అపారమైన ఉద్యోగ అవకా శాలు కూడా లభిస్తాయి. – మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో అమెజాన్ సేవల విస్తరణ
అమెజాన్ సంస్థ హైదరాబాద్‌లోని తమ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో భాగంగా ‘అమెజాన్ వెబ్ సర్వి సెస్ (ఏడబ్ల్యూఎస్) డేటా సెంటర్ ప్లానింగ్ అండ్ డెలివరీ’వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పియర్సన్, ఇతర ప్రతినిధులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో అమెజాన్ డేటా సెంటర్ కార్యకలాపాలపై చర్చలు జరిపారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. తాజాగా ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను, తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలను అమెజాన్ ప్రతినిధులు వివరించారు.
ఆర్టిఫిషయల్ఇంటెలిజెన్స్‌తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సేవల వృద్ధికి హైదరాబాద్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని కెర్రీ పియర్సన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ వృద్ధిలో ఆశించిన లక్ష్యాలను అందుకునేందుకు తమ కంపెనీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment