కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్‌ హస్తం..! | Collector Hand In Keesara MRO Corruption Case | Sakshi
Sakshi News home page

కీసర ఎమ్మార్వో కేసులో కీలక పరిణామాలు

Published Thu, Sep 3 2020 2:48 PM | Last Updated on Thu, Sep 3 2020 5:23 PM

Collector Land In Keesara MRO Corruption Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్‌ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం సాక్షి మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. కలెక్టర్‌, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్‌ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్‌ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్‌ ప్రకాష్‌ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్‌ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్‌, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్‌ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు (కలెక్టర్‌ ఎవరు అనేది తెలియాల్సి ఉంది). ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్‌ రిపోర్టు)

కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్‌లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెం‍ట్స్‌పై విచారణ కొనసాగుతోంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement