Keesara MRO
-
సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన ఇంట్లోనే నిర్జీవంగా పడివున్న అతడిని పోలీసులు గుర్తించారు. ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జుననగర్ కాలనీకి చెందిన కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో మూడేళ్ల క్రితమే భర్తను వదిలి వెళ్లడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండటంతో భరించలేని తల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం నాగరంలోని కూతురు ఇంటికి వెళ్లింది. మూడు రోజులుగా ఇంట్లో ఎవరులేక పోవడంతో ఇంటిని శుభ్రం చేసేందుకు ఆదివారం ఉదయం నాగార్జుననగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చింది. తాను ఉండే ఇంటిని శుభ్రం చేసి కొడుకు గది వద్దకు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతకు పలకకపోవడంతో డోర్ తెరుచుకొని లోనికి వెళ్లింది. డైనింగ్ టేబుల్ వద్ద కొడుకు పడిపోయి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె చుట్టు పక్కల వారిని పిలిచింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధాంరించారు. తండ్రి ఆత్మహత్య.. కొడుకు అనుమానాస్పద మృతి శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగా జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదీ వివాదం.. భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న కీసర అప్పటి తహసీల్దార్ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. -
కీసర ఆత్మహత్యలు: పెద్దల పేర్లు బయటికొస్తాయనే
సాక్షి, హైదరాబాద్: వరుస అరెస్టులు, ఆత్మహత్యలతో ‘కీసర వ్యవహారం’రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత పరిణామాలు.. ఈ ఆత్మహత్యల వెనక రాజ కీయ నేతల హస్తం ఉండి ఉంటుందన్న ఏసీబీ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూవివాదం, ధర్మారెడ్డి ఆత్మహత్యపై స్థానిక నాయకుడిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన సదరు నాయకుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంలో పెద్ద తలలున్నాయని చెప్పుకొచ్చాడు. మాజీ తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డివి ఆత్మహత్యలు కావని, వీరి మృతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేయడంతో వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. అన్నీ అనుమానాలే.. కీసర భూవివాదంలో ఏసీబీ అధికారులు అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ నుంచి రూ. కోటిపది లక్షలు స్వాధీనం చేసుకున్న సమయంలో తొలుత ఓ ఎంపీ పాత్రపై ఆరోపణలొచ్చాయి. సదరు నాయకుడి భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత దీనిపై రకరకాల ప్రచారాలు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. ఆయనకు దీనితో సంబంధం లేదని, ఏమైనా ఆధారాలు లభిస్తే విచారణకు పిలుస్తామని చెప్పారు. తరువాత చంచల్ౖగూడ జైలులో మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆయన భార్య మానవ హక్కుల సంఘం వరకు వెళ్లారు. అంతలోనే నకిలీ పాస్‌పుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ బలవన్మరణాలపై అనుమానాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు మరికొందరి రాజకీయ నేతల పేర్లు బయటికొస్తుండటం వీటికి బలం చేకూరుస్తోంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగానే.. కీసర తహసీల్దార్ నాగరాజు సాయంతో కందాడి ధర్మారెడ్డి వివాదాస్పద 93 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడని, అందులో భాగంగానే తన కుటుంబసభ్యుల పేరిట 24 ఎకరాలకు అక్రమంగా పాస్‌బుక్ లు జారీ చేయించుకున్నాడనేది ఏసీబీ ఆరోపణ. కానీ, తామెక్కడా నిబంధనలు అతిక్రమించలేదని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదుచేసి ధర్మారెడ్డిని, అతని కుమారుడు మరికొందరిని అరె స్టు చేసింది. ఈ వివాదంలో స్థానికంగా ఉండే ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రచారం జరగడం తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘పెద్దల పేర్లు బయటికొస్తాయనే..’ కీసర భూవివాదంపై సదరు మాజీ ఎమ్మెల్యే ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తనకు, ధర్మారెడ్డి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. నాగరాజు, ధర్మారెడ్డిలవి అనుమానాస్పద మరణాలని, వారిద్దరూ బతికుంటే పెద్దల పేర్లు బయటికి వస్తాయన్న భయంతోనే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 93 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఈనాటిది కాదని, 2015లోనే దీనికి బీజం పడిందని ఆరోపించారు. కొందరు పెద్దలు కేసును ప్రభావితం చేస్తున్నారని, మొత్తం వివాదంపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తానని బాంబు పేల్చారు. -
కీసర భూ వివాదం: ఆత్మహత్యలా? ప్రేరేపిస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం మరువక ముందే అక్రమ పాస్ పుస్తకాల కేసులో నాగరాజుతో కలిసి అరెస్టయిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్య వెలుగుచూడటం సంచలనం రేపుతోంది. వీరు కేసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నారా? లేక ఎవరైనా వీరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. నిందితుల భద్రతపై ఆందోళన భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఆగస్టు 14న నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.. కందాడి ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 14న నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, మిగిలిన నిందితులంతా జైలులోనే ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో జైలులో ఉన్న మిగిలిన నిందితుల భద్రతపై వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు: వెంకటమ్మ) ఇదీ వివాదం.. ధర్మారెడ్డి అనేక నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాలు కాజేసేందుకు యత్నించిన దాఖలాలున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారు. కీసర మండలంలో 96.22 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారు కింద కాజేసేందుకు గతంలో కీసరలో పనిచేసిన ఓ తహసీల్దార్‌తో కలిసి ధర్మారెడ్డి నకిలీ టెనెంట్ పత్రాలు సృష్టించాడు. స్థాని కులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ధర్మారెడ్డికి ఆ భూమిపై ఎలాంటి హక్కుల్లేవని, అతని వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని అప్పటి తహసీల్ కార్యాలయ అధికారులు సైతం తేల్చారు. తరువాత కీసర మండలానికి నాగరాజు తహసీల్దార్‌గా వచ్చాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పి తాను కన్నేసిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు సాయంతో కాజేసే ప్రయత్నం చేశా డు. దీనిపై స్థానికులు అభ్యంతరాలు తెలిపినా.. నాగరాజు పట్టించుకోకుండా ధర్మారెడ్డి, అతని కుటుంబసభ్యులకు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేశాడు. దీంతో స్థానికులు ఆర్డీవో కార్యాలయంలో అప్పీల్‌తోపాటు, ఉన్నతాధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు రంగం లోకి దిగి.. నాగరాజు, ధర్మారెడ్డి కలిసి పాల్పడ్డ భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన మీదట ఏసీబీ నాగరాజు, ధర్మారెడ్డి, అతని కుమారుడు తదితరులను అరెస్ట్ చేసింది. వరుస ఆత్మహత్యలపై ఆరా నాగరాజు ఏసీబీ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కేసు ముగిసిపోదని, యథావిధిగా దర్యాప్తు సాగుతుందని, మిగిలిన నిందితులనూ విచారిస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అంతలోనే మరో కీలక నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ ఈ కేసులో ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వీరు నిజంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారా? ఎవరైనా అందుకు ప్రేరేపించారా? అనేది కూపీలాగేందుకు వీరి ములాఖత్, ఫోన్ రికార్డ్స్‌పై ఏసీబీ ఆరా తీస్తోందని తెలిసింది. రాజకీయ అండదండలున్న వ్యక్తులే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటారని అనుమానిస్తోంది. ఇవి ఆత్మహత్యలు కావని, రాజకీయ అండదండలున్న కొందరు వీరిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని కీసరవాసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ధర్మారెడ్డి ఆత్మహత్య.. అనుమానాలెన్నో..
సాక్షి, హైదరాబాద్/కుషాయిగూడ: కీసర భూవివాదం కేసులో మాజీ తహసీల్దారు నాగరాజుతో పాటు అరెస్టయిన ధర్మారెడ్డి (77) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటికే నాగరాజు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. ధర్మారెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన పది రోజు లకే స్థానిక ఆలయం సమీపంలో వేపచెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించడం అనుమానాలకు తావి స్తోంది. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుషాయిగూడ నాగార్జుననగర్ కాలనీకి తరలించారు. ఇదే కేసులో చంచల్‌గూడ జైల్లో ఉన్న కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి రాగానే రాంపల్లి దయారాలో ధర్మారెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. శనివారం ఇంట్లోంచి వెళ్లి.. ఆదివారం శవమై.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటికెళ్లారు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆదివారం తెల్లవారుజామున ఆరున్నర గంటల ప్రాంతంలో వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్న సమాచారం తెలి సింది. ఏడేళ్లుగా అప్పుడప్పుడు ధర్మారెడ్డి ఆ ఆలయంలో రాత్రిళ్లు నిద్రించేవారని, చివరకు అక్కడే శాశ్వత నిద్రలోకి వెళ్లారంటూ బంధువులు రోదిం చారు. కాగా, బెయిల్‌పై ఇంటికి వచ్చినా ధర్మారెడ్డికి పోలీసుల వేధింపులు ఆగలేదని వారు అంటున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టుకొచ్చి సంతకం చేసి వెళ్లాలని చెప్పారని, ఆరోగ్యం సహకరించట్లేదని బతిమాలినా పోలీసులు వినిపించుకోలేదని వారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారని, కోర్టుకు వెళ్లలేక, మరోపక్క కొడుకుకు ఇంకా బెయిల్ రాకపోవడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. అనుమానాలెన్నో.. 77 ఏళ్ల ధర్మారెడ్డి సరిగా నడవలేరు. చీకటిపడితే కళ్లు సరిగా కనిపించవు. అటువంటి వ్యక్తి గుడి సమీపంలో 12 అడుగుల ఎత్తున్న వేపచెట్టు కొమ్మకు తాడు ఎలా కట్టారన్నది అంతుచిక్కట్లేదు. గుడిలోకి చెందిన అడుగున్నర ఎత్తుండే ఓ కుర్చీ ఘటనాస్థలిలో కనిపించింది. ఒకవేళ కుర్చీ ఎక్కి కొమ్మకు దుస్సు ముడివేశారా అంటే.. ఘటనాస్థలాన్ని చూస్తే అలా లేదు. తాడును కొమ్మకు గట్టిగా బిగించి కట్టినట్టుంది. చెట్టెక్కితేనే అది సాధ్యం. వయసు దృష్ట్యా ధర్మారెడ్డి చెట్టెక్కి కొమ్మకు తాడు కట్టడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఘటన స్థలంలో కనిపించిన కుర్చీని వేపచెట్టువైపు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీకి చిక్కలేదు. ఈ దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదీ వివాదం.. నవాబుల నుంచి వారసత్వంగా సంక్రమించిన 96 ఎకరాలకు ధర్మారెడ్డి తండ్రి నారాయణరెడ్డి 1950 నుంచి 58 మధ్యకాలంలో టెనెంట్‌గా ఉన్నారని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ‘రెండేళ్ల పాటు పన్నులు చెల్లించడంతో 38ఈ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కిషన్‌సింగ్ అనే వ్యక్తి రికార్డులను తారుమారుచేసి కొందరికి ఆ భూమి విక్రయించాడు. దీనిపై విచారణ జరిపిన అప్పటి తహసీల్దార్ అందులో 24 ఎకరాలకు ధర్మారెడ్డితో పాటు అతని ముగ్గురి సోదరుల పేరుపై పట్టా పాస్‌బుక్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే, ఆ భూమి తమదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 25న ధర్మారెడ్డిని, 29న అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులను అన్యాయంగా అరెస్టు చేశార’ని వారు అంటున్నారు. కాగా, ఈ వివాదానికి సంబంధించి అప్పటికే లంచం కేసులో అరెస్టయి ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజుపై.. ధర్మారెడ్డి పేరిట అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలను సృష్టించారనే ఆరోపణలతో ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఏ సమయంలో ఏం చేశాడంటే.. – శనివారం సాయంత్రం 4.48 ని.: ధర్మారెడ్డి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చారు. 5.08: వరకు ఉండి వెళ్లిపోయారు. 5.24కి మళ్లీ వచ్చి.. రాత్రి 7.43కి బయటకు వెళ్లారు. 8.06కు మళ్లీ వచ్చి వెంటనే వెళ్లిపోయారు. – రాత్రి 8.54: ధర్మారెడ్డి ఫోన్ మాట్లాడుతూ మళ్లీ ఆలచానికి వచ్చారు. 9.30: టవల్ వేసుకొని పడుకున్నారు. 10.11: ఓ బాబుతో ముగ్గురు మహిళలు వచ్చి చాప పర్చుకొని పడుకున్నారు. ఈ అలికిడికి ధర్మారెడ్డి నిద్రలేచి 10.14 సమయంలో గుడిలోనే అటుఇటు తిరిగారు. – 11.24: ఓ మహిళ నిద్రలేచింది. అటూఇటూ చూసి మళ్లీ పడుకుంది. – 11.33: మళ్లీ లేచిన ఆమె అక్కడే ఉన్న కుళాయి నుంచి బాటిల్లో నీళ్లు నింపుకుంది. ఆపై తనతో ఉన్న ఇద్దరినీ నిద్రలేపింది. వారంతా ధర్మారెడ్డి కదలికలను గమనించారు. – 12.10: ముగ్గురు మహిళలు వెళ్లిపోయారు. – 12.13: ధర్మారెడ్డి చేతిలో టవల్‌తో వెళ్లారు. సివిల్ కేసులో పోలీసుల ప్రమేయమేంటి? మాకు ఎలాంటి సంబంధం లేని తహసీల్దార్ నాగరాజు కేసులో మా నాన్న, అన్నయ్యను పోలీసులు కొందరు పెద్దల ఒత్తిడితో ఇరికించారు. కావాలని సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చారు. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. – ఉమాదేవి, మృతుడి చిన్న కుమార్తె అంత్యక్రియలకు నా కొడుకును పంపించండి కొందరి ఫిర్యాదుతో నా భర్తను, కొడుకును అన్యాయంగా అరెస్ట్ చేశారు. సదరు భూమి పత్రాలు ఎక్కడంటూ నా భర్త ధర్మారెడ్డిని ఏసీబీ అధికారులు బెదిరించారు. నా భర్త అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిని పంపించాలి. అప్పటివరకు మృతదేహాన్ని ఇక్కడే ఉంచుతాం. – వెంకటమ్మ, మృతుడి భార్య -
వేధింపులతోనే ఆత్మహత్య: ధర్మారెడ్డి భార్య
సాక్షి, హైదరాబాద్ : కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో తన భర్తను పోలీసులు వేధించారని ఆత్మహత్య చేసుకున్న ధర్మారెడ్డి భార్య వెంకటమ్మ ఆరోపించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మృతుడి భార్య మాట్లాడుతూ.. ‘భూ వివాదంలో నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు. తహసీల్దార్ నాగరాజుకు, నా భర్తకు సంబంధం లేదు. మా ఇంట్లో సోదాల్లో ఎలాంటి పాస్‌బుక్ దొరకలేదు. (నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య) జైలు నుంచి బయటకు వచ్చాక నా భర్త తీవ్ర మనస్తాపం చెందారు. బెయిల్‌పైన వచ్చాక కూడా రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని పోలీసులు వేధించారు. నా భర్తను కలిసి బయటకి వచ్చిన తర్వాత రోజు నాగరాజు జైలులో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త విన్నాం. ఓ వైపు పోలీసుల వేధింపులు, మరోవైపు భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయంతోనే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కుమార్తెలు మాట్లాడుతూ... ‘మా నాన్నపై కక్ష కట్టి కేసులు పెట్టారు. జైలు నుంచి బయటకి వచ్చాక మనస్తాపం చెందాడు. తన మర్యాద మొత్తం పోయిందని బాధపడ్డాడు. కందాడి భూపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు మా నాన్నపై ఫిర్యాదు చేశారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. కేఎల్ఆర్ మా భూమిని కబ్జా చేసి వేధించారు. నాగరాజుకు మా నాన్నకు పెద్ద పరిచయం కూడా లేదు. జైలు నుంచి వచ్చాక నేను ఎందుకు బతకాలి... చనిపోతా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి మా నాన్న తిరిగి రాలేదు. ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ధర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ లభించకపోవడంతో జైలులోనే ఉన్నాడు. ధర్మారెడ్డి మృతదేహానికి శవ పరీక్ష పూర్తయ్యింది. అసిస్టెంట్ దాక్టర్ లావణ్య మరియు 5దు గురు పీజీ డాక్టర్స్ బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కుషాయిగూడలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
-
నాగరాజు కేసు : మరో వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, మేడ్చల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మోటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. కాగా కోటి రూపాయల కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఇటీవల జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఒకే కేసులో ఇద్దరు నిందితులు వరుగా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకిత్తిస్తోంది. మరోవైపు వీరి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య.. అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: కీసర ఎమ్మార్వో నాగరాజు మృతి కేసులో అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరాజుది ఆత్మహత్య కాదు, ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటుంటే జైలు సిబ్బంది ఏం చేశారు? జైలు సిబ్బందిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అని సందేశాలు వ్యక్తం చేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదని తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఇప్పటికే సీసీ ఫుటేజీ ఏసీబీ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ విషయంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తామని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే నాగరాజు కుటుంబ సభ్యులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. చదవండి: నాగరాజుది హత్యే.. -
ఎమ్మార్వొ నాగరాజు బినామీలపై ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్ : కీసర నాగరాజు అవినితీ కేసులో బినామీలపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బొల్లారంకు చెందిన నంద గోపాల్ అనే వ్యక్తి బినామీగా ఉన్నట్లు తేలింది. దీంతో ఇంకా అతని ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఇక అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) -
నాగరాజుది హత్యే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యపై తమకు అనుమానాలున్నాయని, ఆయనది ముమ్మాటికీ హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లో బయటికి వస్తానని, లాయర్లతో మాట్లాడాలని చెప్పిన వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య స్వప్న, బావమరిది శేఖర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాగరాజు భార్య పలు సంచల న ఆరోపణలు చేశారు. ఆయన చాలా ధైర్యవంతుడని, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామన్నారు. అసలు రూ. కోటి పది లక్షల లంచం కేసు తప్పుడుదని.. ఆయన్ను అన్యాయంగా ఇరికించారని వాపోయారు. తాను, పిల్లలంటే ప్రాణమిచ్చే వ్యక్తి తన ప్రాణాలు ఎందుకు తీసుకుంటాడని ప్రశ్నించారు. ఈ విషయంలో జైలు అధికారులు, పోలీసులు, ఏసీబీ మీద తమకు న మ్మకం లేదన్నారు. ఆయన మరణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసేందుకు సీబీఐ విచారణ జరగాల్సిందేనని స్వప్న డిమాండ్ చేశారు. దాడులు జరిగిన ఆగస్టు 14 రాత్రి ఏసీబీ అధికారులే నగదు బ్యాగుల్లో తీసుకువచ్చారని, తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని నాగరాజు చెప్పారన్నారు. అసలు టర్కీ టవల్‌తో ఉరివేసుకోవడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ఆ సమయం లో నాగరాజుతోపాటు ఉన్నవారంతా ఎందు కు లేవలేదని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం 3.30 గంటలకు నాగరాజు ఆత్మహత్య చేసుకుంటే.. 6 గంటలు దాటాక తమ కు సమాచారం ఇచ్చారని వాపోయారు. అది ముమ్మాటికీ తప్పుడు కేసు.. రూ.కోటి పది లక్షల కేసు తప్పుడుకేసని నాగరాజు బావమరిది శేఖర్ ఆరోపించారు. ఆ మొత్తం ఏసీబీ వాళ్లే తీసుకువచ్చారని ధ్వజమెత్తాడు. ఈ మేరకు తమ వద్ద సీసీ టీవీ ఫుటేజీ ఉందని, వాటిని హైకోర్టుకు అందజేస్తామన్నారు. అసలు రూ.కోటి పదిలక్షల కేసు నిలవదని తెలిసాకే, నాగరాజును ఇరికించేందుకు నకిలీ పాసు పుస్తకాల కేసు పెట్టారని తెలిపారు. ఆత్మహత్యకు ముందురోజు వీడియో కాల్ నకిలీ పాసు పుస్తకాల జారీ కేసులో కందాడి ధర్మారెడ్డితోపాటు నాగరాజు మరో నలుగురిని ఏసీబీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఈ నెల 13, 14 తేదీల్లో నాగరాజును ప్రశ్నించేందుకు ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. కస్టడీకి ఒక్కరోజు ముందు.. అంటే ఈ నెల 12న కుటుంబ సభ్యులతో నాగరాజు వీడియో కాల్లో మాట్లాడారు. ఆ కాల్ రికార్డును కూడా కుటుంబసభ్యులు మీడియాకు విడుదల చేశారు. అందులో ఏముందంటే.. తాను అన్ని పత్రాలు పరిశీలించాకే ముందుకు వెళ్లానని, ఎలాంటి తప్పు చేయలేదని వీడియోలో చెప్పడం కనిపించింది. భయపడాల్సిన పనిలేదని, బెయిల్ వస్తుందని న్యాయస్థానంలో పోరాటం చేద్దామని నాగరాజుకు శేఖర్ ధైర్యం చెప్పడం వీడియోలో కనిపించింది. -
మాజీ తహసీల్దార్ నాగరాజు వీడియో కాల్?!
సాక్షి, హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు మృతి కేసులో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఆయన చివరిసారిగా తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారని తెలిసింది. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. అన్నీ రికార్డ్స్ పరిశీలించాకే చేశాం. న్యాయవాదికి ఈ విషయాలు చెప్పి కోర్టులో తెలపాలి’అని నాగరాజు ఆ వీడియో కాల్లో కుటుంబసభ్యులను కోరినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూసుకుందామని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక నిన్న మీడియాతో మాట్లాడిన నాగరాజు కుటుంబ సభ్యులు, అతను ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు వాదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని శుక్రవారం తెలిపారు. కాగా, కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును నెలరోజులుగా ఏసీబీ విచారించింది. ఈక్రమంలోనే చంచలగూడ జైల్లో ఉన్న ఆయన గత బుధవారం ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. నాగరాజు మృతిపై కస్టోడియల్ డెత్ కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు) (చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య!) -
కీసర ఎమ్మార్వో మృతిపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్అయిన కీసర తహసీల్దార్ నాగరాజు జైల్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ ఈనెల 14న చంచల్‌గూడ జైల్లో టవల్‌తో ఉరివేసుకున్న విషయం తెలిసిందే. నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సైతం సంచలన వ్యాఖ్యలు చేస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యనని, సీబీఐ విచారణ కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తాము తెలిపారు. (కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య) ఈ మేరకు శుక్రవారం నాగరాజు కుటుంబ సభ్యులు సాక్షి మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో ఆత్మహత్య ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ‘ఎంతోమంది ఖైదీలు ఉండే జైల్లో ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. అదీ టవల్‌తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు..? పక్కన ముగ్గురు ఖైదీలు వున్నారు. ఆ సమయంలో వాళ్లేంచేశారు. ఏసీబీ కేసుల్లో వాస్తవం లేదు. అందుకు తగ్గ ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఇప్పటికే సీసీ వీడియో ఏసీబీ కోర్టుకి ఇచ్చాము. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే నాగరాజు వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసులో ఇరికించారు. ఈ ఘటనపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి. చనిపోడానికి ముందు ఉదయం మాతో ఫోన్లో మాట్లాడాడు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అన్నారు. ప్రభుత్వ ఉధ్యోగులకు ఇలాంటి కేసులు సహజం. న్యాయపరంగా బయటకువచ్చాక పోరాటం చేద్దామన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు. మా అందరికీ ఆయనే దిక్కు. మా పరిస్థితి ఏంటీ’అని ప్రశ్నించారు. మరోవైపు నాగరాజు చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడారు, ఏం చెప్పారు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?
అవినీతి అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భూ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు పట్టుబడగా.. ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న నాగరాజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య! నాగరాజు ఆత్మహత్యపై కస్టోడియల్ డెత్‌గా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైలు సిబ్బందిని విచారించారు. చనిపోయే ముందు రోజులు కస్టడిలో భాగంగా ఏసీబీ అధికారులు నాగరాజును విచారించారు. దీంతో ఆత్మహత్య చేసుకునే ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు ఎవరెవరితో మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విషయాల్లో దర్యాప్తు సాగుతోంది. చదండి: కీసర నాగరాజా మజాకా! -
కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే అవినీతి నిరోధక శాఖ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచలగూడ జైలులో ఉన్న నాగరాజు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ.కోటి 10 లక్షల లంచం కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. నెలరోజులుగా ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) నాగరాజుపై ఏసీబీ ప్రశ్నల వర్షం నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజుపై ఏసీబీ మంగళవారం ప్రశ్నల వర్షం కురిపించింది. రెండోసారి అతడిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని అడిగారు. దీనికితోడు అదే ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు కాగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్ 604 నుంచి 614 వరకు గల కోర్ట్ ఆఫ్ వార్డ్స్ (గవర్నమెంట్ కస్టోడియన్ ల్యాండ్) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు నాగరాజు రియల్ బ్రోకర్ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే. ఇక అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ఐ, డీటీ, తహసీల్దార్ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను
సాక్షి, హైదరాబాద్: కీసర భూ బాగోతం ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహా రంలో తాను మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే శ్రీనాథ్, అంజిరెడ్డిలను కలిసేందుకు వెళ్లానని, అదే సమయంలో ఏసీబీ దాడి జరిగిందని కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ విచారణలో వెల్లడించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. గురువారం ఏసీబీ న్యాయస్థానానికి అందజేసిన నిందితుల నేరాంగీకారపత్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పలు సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మొత్తం కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవో రవి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ ప్రకాశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 తహసీల్దార్ నాగరాజు, ఏ2 వీఆర్ఏ సాయిరాజు, ఏ3 శ్రీనాథ్‌యాదవ్, ఏ4 అంజిరెడ్డిలతోపాటు ఇటీవల ఏసీబీ కస్టడీలో అనేకమంది అధికారుల పేర్లు వెల్లడించారు. నాగరాజు ఏమని చెప్పాడంటే.. విచారణలో నాగరాజు ఏసీబీ అధికారులకు అస్సలు సహకరించలేదు. పలు కీలక ప్రశ్నలకు ఆయన మౌనం వహించాడు. అయితే శ్రీనాథ్, అంజిరెడ్డిల నుంచి లంచం తీసుకునే విషయమై నాగరాజు సంచలన విషయాలు వెల్లడించాడు. తాను మేడ్చల్ కలెక్టర్, ఆర్డీవో రవి ఆదేశాల మేరకే భూవివాదంపై చర్చించడానికి అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను కలిసేందుకు కాప్రా వెళ్లానని స్పష్టం చేశాడు. అంజిరెడ్డి, శ్రీనాథ్యాదవ్లకు ఈ వివాదాస్పద భూమితో ఎలాంటి యాజమాన్య సంబంధం లేదన్నాడు. వాస్తవానికి శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూవివాదం తన పరిధిలో లేనేలేదని చెప్పాడు. శ్రీనాథ్ వివరణ ఇదీ.. ఏ3 నిందితుడు రియల్టర్ శ్రీనాథ్ యాదవ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాంపల్లి దయారాలోనే సర్వే నంబర్ 614లోని 61 ఎకరాల 20 గుంటల వివాదాస్పద భూమి గురించి తనకు కీసర మండలం భోగారం గ్రామానికి చెందిన ఇక్బాల్ ద్వారా తెలిసిందని శ్రీనాథ్ చెప్పాడు. తాను అంజిరెడ్డిని, అతని సోదరుడు హన్మంతరెడ్డి ద్వారా కలిశానన్నాడు. దాంతో భూమి పొజిషల్‌లో ఉన్న పట్టాదారులు, ముస్లింలతో ఇక్బాల్ ద్వారా, గ్రామస్తులను అంజిరెడ్డి సాయంతో అనేక సార్లు సమావేశమయ్యానన్నారు. చివరికి ఈ భూ వివాదంపై తాను సూచించిన పరిష్కారానికి వారంతా అంగీకరించారన్నాడు. ఇందులో భాగంగానే ఈ భూమికి సంబంధించి మొయినుద్దీన్ గాలిబ్ మరో 37 మంది ద్వారా తన పేరిట జీపీఏ చేయించినట్లు వివరించాడు. నగదును ఎలా సేకరించావన్న ప్రశ్నకు శ్రీనాథ్ బదులిస్తూ.. ఆగస్టు 14న తాము తన స్నేహితుడు యుగంధర్‌తో కలిసి తన కారులో కాజీపేట వెళ్లామని పేర్కొన్నాడు. మొత్తం రూ.కోటీ పది లక్షలను తన స్నేహితుడైన ముడిదె తేజేశ్వర్ ఏర్పాటు చేశాడన్నారు. తేజేశ్వర్ సూచన మేరకు తాము రూ.70 లక్షలను వరంగల్ బస్టాండ్ సమీపంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తీసుకున్నామన్నారు. దేవీ థియేటర్ వెనక భాగంలో రూ.30 లక్షలు, మరో రూ.10 లక్షలను రత్నం రాజిరెడ్డి, ఆర్ఎల్ రవి నుంచి అంబేడ్కర్ భవన్ వద్ద తీసుకున్నామన్నాడు. డబ్బును కారు డిక్కీలో పెట్టుకుని రాత్రి 7.30 గంటలకు కాప్రా ఆరుల్నగర్లోని అంజిరెడ్డి ఇంటికి చేరుకున్నామని చెప్పాడు. తహసీల్దార్ నాగరాజుతో పరిచయం ఎలా జరిగింది అన్న ప్రశ్నకు.. ఈ ఏడాది మార్చిలో తన మిత్రుడు, హన్మకొండ తహసీల్దార్ అయిన కిరణ్ ప్రకాశ్ ద్వారా కీసర ఆర్డీవో రవి పరిచయమయ్యాడని, ఆయన ద్వారా నాగరాజును ఆశ్రయించానని చెప్పాడు. ఈ పనికి నాగరాజును పురమాయించేందుకు ఆర్డీవోకి ఏమైనా లంచం ఇచ్చావా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ నోరు మెదపలేదు. అదే విధంగా ఈ వ్యవహారం పరిష్కరించేందుకు, మ్యుటేషన్ ఇంకా కలెక్టర్ ప్రొసీడింగ్స్ కోసం నాగరాజుకు, వీఆర్ఏ సాయిరాజుకు అంజిరెడ్డి ఇంట్లో ఏమైనా డబ్బులు చెల్లించారా? అన్న ప్రశ్నకు శ్రీనాథ్ సమాధానం చెప్పలేదు. -
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
-
కీసర ఎమ్మార్వో కేసులో కలెక్టర్ హస్తం..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం సాక్షి మీడియా చేతికి చెక్కింది. ఈ కేసులో కీసర ఎమ్మార్వోతో పాటు పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో బహిర్గతమైంది. కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో తహశీల్దార్ పాత్ర ఉందని నిందితుల వాంగ్మూలంలో తేలింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో నాగరాజు ఒప్పందం కుదిరిందని ఈ కేసులో ఏ3 నిందితుడు శ్రీనాథ్ వాంగ్మూలం ఇచ్చారు. దయారాలోని 614, మరికొన్ని సర్వే నెంబర్లలోని 61 ఎకరాల 20 గుంటల భూమి.. సాయిరాజ్, అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదరిందన్నారు. మొయినుద్దీన్ మరో 37 మంది వద్ద నుంచి భూమి అగ్రిమెట్ చేసినట్లు విచారణలో వెల్లడించారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటారని మాట్లాడుకున్నట్లు పేర్కొన్నారు (కలెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది). ఏసీబీ అధికారులకు చిక్కిన కోటి పదిలక్షల రూపాయలను వరంగల్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకే భూ వివాదంపై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్‌కి వెళ్లానని ప్రధాన నిందితుడు ఎమ్మార్వో నాగరాజు (ఏ1) తెలిపారు. శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు. గతంలో తనతండ్రి డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేశాడని, తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు తెలిపారు. 1995లో టైపిస్టుగా రెవెన్యూ శాఖలో చేరినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి కుత్బుల్లాపూర్, తాండూరు, ఘటకేసర్, ఉప్పల్, ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేసినట్లు విచారణలో చెప్పారు. అంతేకాకుండా తన పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఒప్పుకున్నారు. 2011లోనే నాగరాజుపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 10కోట్ల ఆస్తులు గుర్తించారు. ఇక తాజా కేసు నేపథ్యంలో అతని బ్యాంకు లాకర్లలో 55లక్షల బంగారు ఆభరణాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్‌పై విచారణ కొనసాగుతోంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
నాగరాజు లాకర్లో 1.5 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్‌లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్ పేరిట అల్వాల్‌లోని సౌత్ ఇండియన్ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. (కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు) మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. గత నెల 14న రూ.కోటి పది లక్షల నగదు లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం జాతీయస్థాయిలో కలకలం రేపింది. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర ఎమ్మార్వో నాగరాజు రిమాండ్ రిపోర్టు
సాక్షి, మేడ్చల్: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ శుక్రవారం విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. రాంపల్లి దాయర వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు రిపోర్టులో తేలింది. ఇందులో భాగంగానే తహశీల్దార్ నాగరాజుకు 1.10 కోటి రూపాయలు డీల్‌ను అంజిరెడ్డి కుదిర్చినట్లు తేలింది. నాగరాజుకు అందజేసిన డబ్బు శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సమకూర్చినట్లు బయటపడింది. దీంతోపక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ.. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్‌ను సీజ్ చేసింది. అయితే నాగరాజుతో డీల్‌కు సంబంధించి అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో సమావేశమైనట్లు తెలిసింది. ఏసీబీ దాడి సమయంలో అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లోనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిని మొత్తం సెర్చ్ చేసిన ఏసీబీ.. ఎంపీ రేవంత్ రెడ్డికి సంబంధించిన 65 పేజీల రెప్రజెంటేటివ్ లెటర్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది.గుండ్ల పోచంపల్లి గ్రామ పంచాయతీ కి సంబంధించి ఇళ్ళ అనుమతికి 204 పేజీల పత్రాలతో పాటు, రాంపల్లి దాయర భూ పంచాయతీకి సంబంధించి ఆర్టీఐ నుండి సేకరించిన 105 పేజీల పత్రాలు, పలు కేసుల ఎఫ్ఐఆర్ కాపీలు, కోర్ట్ ఆర్డర్ కాపీలతో పాటు 65 పత్రాలు స్వాధీనం చేసుకుంది. (చదవండి : కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!) ఈ అంశాలపైనే మూడు రోజుల పాటు విచారించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో నిందితులెవరు సహకరించలేదని ఏసీబీ తెలిపింది. దీంతో నిందితులను మరోమారు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో నాగరాజుతో పాటు మిగతా నిందితులు ఏసీబీ కోర్టులో శుక్రవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. (చదవండి : గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!
-
కోటి లంచం కేసు : రేవంత్‌పై విచారణ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర ఎమ్మార్వో కోటి రూపాయల లంచం కేసులో ఏసీబీ విచారణ మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ గురువారం ‘సాక్షి మీడియా’తో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. కీసర అవినీతి కేసులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. అంజిరెడ్డి ఆ డాక్యుమెంట్లు రేవంత్‌రెడ్డికి చెందినవిగా ఒప్పుకున్నారని, ఈ డాక్యుమెంట్లుపై విచారణ జరిపామని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేదన్నారు. మరోసారి రేవంత్, అంజిరెడ్డి పత్రాలపై విచారణ జరుపుతామని తెలిపారు. (కీసర తహశీల్దార్ కేసులో విచారణ వేగవంతం) రేవంత్ పాత్ర ఉందని తేలితే అతన్ని కూడా పిలిచి విచారిస్తామని ఏసీబీ డీఎస్పీ స్పష్టం చేశారు. ఇక తహసీల్దార్ నాగరాజు బ్యాంక్ లాకర్లపై ఎలాంటి స్పష్టత రాలేదని, ఏసీబీ విచారణకు నిందితులు సహకరించలేదని చెప్పారు. తహసీల్దార్ నాగరాజు, ఆయన భార్య ఇద్దరు కలిసి లాకర్ల వ్యవహారంపై తమని తప్పుతోవ పట్టించారని తెలిపారు. శ్రీనాథ్ డబ్బులు వరంగల్ నుంచి తీసుకువచ్చినట్లు , అవి లంచం కోసమే తెచ్చినట్లు అంగీకరించాడని సూర్యనారాయణ వెల్లడించారు. (గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్) -
కీసర తహశీల్దార్ కేసులో విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రూ.కోటి.10 లక్షల పై రియల్టర్ శ్రీనాథ్ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్ సహకరించాడన్న నేపథ్యంలో శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. కాగా రియల్ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పాడు. డబ్బు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఏసీబీకి శ్రీనాథ్ తెలిపారు. నాగరాజు సహచరుడు అంజిరెడ్డి వద్ద దొరికిన ప్రజాప్రతినిధి డాక్యుమెంట్లపై ఏసీబీ వివరాలు సేకరించింది. గుండ్లపోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను.. ఆర్టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి తెలిపారు. రాంపల్లి దయారా గ్రామానికి సంబంధించిన రూ.54 లక్షల ఎంపీ నిధుల మంజూరు లెటర్‌హెడ్‌పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. మరో నాలుగు నియోజకవర్గాల పనుల కోసం నిధుల కేటాయింపుకు సిద్ధం చేసిన లెటర్‌హెడ్స్ అని అంజిరెడ్డి తెలిపినట్టు సమాచారం. కాగా తహశీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని, బ్యాంక్ లాకర్లపై నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. బినామీ ఆస్తులపై, తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని ఏసీబీ ప్రశ్నించింది. నేటితో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ హాజరుపర్చనుంది. చదవండి: గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్ -
రూ.కోటి 10 లక్షలు ఎవరివని ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో రెండో రోజు ఏసీబీ అధికారుల విచారణ ముగిసింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజు, వీఆర్వో సాయిరాజ్‌తో పాటు నిందితులుగా ఉన్న అంజిరెడ్డి, శ్రీనాథ్‌లకు సంబంధించి అనేక విషయాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి ఇంట్లో దొరికిన భూ లావాదేవీల డాక్యుమెంట్ల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో కోటి 10 లక్షల రూపాయల డబ్బు ఎవరివి అన్నదానిపై పూర్తి వివరాలు రాబట్టిననట్లు సమాచారం. ఎమ్మార్వో నాగరాజు మాత్రం ఏసీబీ అధికారులకు సహకరించనట్లు తెలుస్తోంది. తాజా విచారణలో సైతం ఆయన బ్యాంకు లాకర్లపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విచారణ అనంతరం ఈ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కార్యాలయం నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి: 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) -
గిన్నిస్ బుక్ రికార్డులోకి కీసర తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కీసర తహసీల్దార్ బాలరాజు నాగరాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాలని అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న చెందిన రెండు స్వచ్ఛంద సంస్థలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక భూపట్టా విషయంలో రూ.2 కోట్లకు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీకరిస్తూ ఇటీవలే తహసీల్దార్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఒక ప్రభుత్వ ఉద్యోగి 20 మిలియన్లను లంచం రూపంలో తీసుకుంటూ పట్టుబడటం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండవచ్చని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) అధ్యక్షుడు పల్నాటి రాజేందర్, వరంగల్ కేంద్రంగా అవినీతి వ్యతిరేక అవగాహన కార్యకలాపాలు నిర్వహిస్తున్న జ్వాల సంస్థ అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న దరఖాస్తులో తెలిపారు. దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్రభుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన తమవద్ద ఇంతవరకు ఎలాంటి కేటగిరీ లేదని, దీనికోసం ప్రత్యేకంగా కేటగిరి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. -
కీసర తహశీల్దార్ కేసులో కొనసాగుతున్న విచారణ