సాక్షి, హైదరాబాద్: వరుస అరెస్టులు, ఆత్మహత్యలతో ‘కీసర వ్యవహారం’రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఇది రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుత పరిణామాలు.. ఈ ఆత్మహత్యల వెనక రాజ కీయ నేతల హస్తం ఉండి ఉంటుందన్న ఏసీబీ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండటం గమనార్హం. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూవివాదం, ధర్మారెడ్డి ఆత్మహత్యపై స్థానిక నాయకుడిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన సదరు నాయకుడు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదంలో పెద్ద తలలున్నాయని చెప్పుకొచ్చాడు. మాజీ తహసీల్దార్ నాగరాజు, ధర్మారెడ్డివి ఆత్మహత్యలు కావని, వీరి మృతిపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేయడంతో వివాదం మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.
అన్నీ అనుమానాలే..
కీసర భూవివాదంలో ఏసీబీ అధికారులు అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు, రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్ నుంచి రూ. కోటిపది లక్షలు స్వాధీనం చేసుకున్న సమయంలో తొలుత ఓ ఎంపీ పాత్రపై ఆరోపణలొచ్చాయి. సదరు నాయకుడి భూములకు సంబంధించిన ఆర్టీఐ దరఖాస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత దీనిపై రకరకాల ప్రచారాలు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. ఆయనకు దీనితో సంబంధం లేదని, ఏమైనా ఆధారాలు లభిస్తే విచారణకు పిలుస్తామని చెప్పారు. తరువాత చంచల్‌ౖగూడ జైలులో మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆయన భార్య మానవ హక్కుల సంఘం వరకు వెళ్లారు. అంతలోనే నకిలీ పాస్‌పుస్తకాల కేసులో అరెస్టయిన ధర్మారెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ బలవన్మరణాలపై అనుమానాలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు మరికొందరి రాజకీయ నేతల పేర్లు బయటికొస్తుండటం వీటికి బలం చేకూరుస్తోంది.
విజిలెన్స్ నివేదిక ఆధారంగానే..
కీసర తహసీల్దార్ నాగరాజు సాయంతో కందాడి ధర్మారెడ్డి వివాదాస్పద 93 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడని, అందులో భాగంగానే తన కుటుంబసభ్యుల పేరిట 24 ఎకరాలకు అక్రమంగా పాస్‌బుక్ లు జారీ చేయించుకున్నాడనేది ఏసీబీ ఆరోపణ. కానీ, తామెక్కడా నిబంధనలు అతిక్రమించలేదని ధర్మారెడ్డి కుటుంబసభ్యులు అంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదుచేసి ధర్మారెడ్డిని, అతని కుమారుడు మరికొందరిని అరె స్టు చేసింది. ఈ వివాదంలో స్థానికంగా ఉండే ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని ప్రచారం జరగడం తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘పెద్దల పేర్లు బయటికొస్తాయనే..’
కీసర భూవివాదంపై సదరు మాజీ ఎమ్మెల్యే ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తనకు, ధర్మారెడ్డి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. నాగరాజు, ధర్మారెడ్డిలవి అనుమానాస్పద మరణాలని, వారిద్దరూ బతికుంటే పెద్దల పేర్లు బయటికి వస్తాయన్న భయంతోనే హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 93 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఈనాటిది కాదని, 2015లోనే దీనికి బీజం పడిందని ఆరోపించారు. కొందరు పెద్దలు కేసును ప్రభావితం చేస్తున్నారని, మొత్తం వివాదంపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాస్తానని బాంబు పేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment