సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి | Keesara Tahsildar Bribery Case: Third Accused Kandadi Srikanth Reddy Found Dead | Sakshi
Sakshi News home page

సంచలన కేసు; మూడో నిందితుడు అనుమానాస్పద మృతి

Published Mon, Jun 20 2022 3:53 PM | Last Updated on Mon, Jun 20 2022 3:53 PM

Keesara Tahsildar Bribery Case: Third Accused Kandadi Srikanth Reddy Found Dead - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్‌ అవినీతి కేసులో మూడో నిందితుడు కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన ఇంట్లోనే నిర్జీవంగా పడివున్న అతడిని పోలీసులు గుర్తించారు. ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నాగార్జుననగర్‌ కాలనీకి చెందిన కందాడి శ్రీకాంత్‌రెడ్డి (37) వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీకాంత్‌ తరచూ భార్యతో గొడవ పడుతుండటంతో మూడేళ్ల క్రితమే భర్తను వదిలి వెళ్లడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండటంతో భరించలేని తల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం నాగరంలోని కూతురు ఇంటికి వెళ్లింది. 

మూడు రోజులుగా ఇంట్లో ఎవరులేక పోవడంతో ఇంటిని శుభ్రం చేసేందుకు ఆదివారం ఉదయం నాగార్జుననగర్‌కాలనీలోని తన ఇంటికి వచ్చింది. తాను ఉండే ఇంటిని శుభ్రం చేసి కొడుకు గది వద్దకు వెళ్లి డోర్‌ కొట్టింది. ఎంతకు పలకకపోవడంతో డోర్‌ తెరుచుకొని లోనికి వెళ్లింది. డైనింగ్‌ టేబుల్‌ వద్ద కొడుకు పడిపోయి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె చుట్టు పక్కల వారిని పిలిచింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతిగా మద్యం తాగడం వల్లే మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధాంరించారు. 

తండ్రి ఆత్మహత్య.. కొడుకు అనుమానాస్పద మృతి
శ్రీకాంత్‌రెడ్డి తండ్రి ధర్మారెడ్డి మాజీ తహసీల్దార్‌ నాగరాజు అవినీతికి పాల్పడ్డ కేసులో మూడు నెలల పాటుగా జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే వాసవిశివనగర్‌ కాలనీలోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తాజాగా ధర్మారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇదీ వివాదం.. 
భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ 2020, ఆగస్టు 14న కీసర అప్పటి తహసీల్దార్‌ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్‌ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. రాంపల్లి దయారాలోని 93 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారన్న ఆరోపణలతో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్‌ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది.

ఏసీబీ కస్టడీలో ఉండగానే అక్టోబర్‌ 14న చంచల్‌గూడ జైలులో నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలై మరుసటి రోజే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు నిందితులు బలవన్మరణాలకు పాల్పడడంతో అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా మరో నిందితుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement