సాక్షి, హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం మరువక ముందే అక్రమ పాస్ పుస్తకాల కేసులో నాగరాజుతో కలిసి అరెస్టయిన మరో నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్య వెలుగుచూడటం సంచలనం రేపుతోంది. వీరు కేసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నారా? లేక ఎవరైనా వీరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
నిందితుల భద్రతపై ఆందోళన
భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఆగస్టు 14న నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్, వీఆర్‌ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజు వ్యవహారాలపై ఏసీబీ ఆరాతీయగా, ధర్మారెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు మరో ఉదంతం వెలుగుచూసింది. దీంతో ఈ కేసులో ధర్మారెడ్డి, అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు.. కందాడి ధర్మారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ.. నాగరాజుపై రెండో కేసును నమోదు చేసింది.
ఈ క్రమంలోనే అక్టోబర్ 14న నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతని కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, మిగిలిన నిందితులంతా జైలులోనే ఉన్నారు. తాజాగా ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ కేసులో జైలులో ఉన్న మిగిలిన నిందితుల భద్రతపై వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.
(చదవండి: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు: వెంకటమ్మ)
ఇదీ వివాదం..
ధర్మారెడ్డి అనేక నకిలీ పత్రాలు సృష్టించి వందల ఎకరాలు కాజేసేందుకు యత్నించిన దాఖలాలున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారు. కీసర మండలంలో 96.22 ఎకరాల భూమిని రక్షిత కౌలుదారు కింద కాజేసేందుకు గతంలో కీసరలో పనిచేసిన ఓ తహసీల్దార్‌తో కలిసి ధర్మారెడ్డి నకిలీ టెనెంట్ పత్రాలు సృష్టించాడు. స్థాని కులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ధర్మారెడ్డికి ఆ భూమిపై ఎలాంటి హక్కుల్లేవని, అతని వద్ద ఉన్నవి నకిలీ పత్రాలని అప్పటి తహసీల్ కార్యాలయ అధికారులు సైతం తేల్చారు. తరువాత కీసర మండలానికి నాగరాజు తహసీల్దార్‌గా వచ్చాడు. ధర్మారెడ్డి చక్రం తిప్పి తాను కన్నేసిన భూములకు నకిలీ పత్రాలు సృష్టించి నాగరాజు సాయంతో కాజేసే ప్రయత్నం చేశా డు.
దీనిపై స్థానికులు అభ్యంతరాలు తెలిపినా.. నాగరాజు పట్టించుకోకుండా ధర్మారెడ్డి, అతని కుటుంబసభ్యులకు అక్రమంగా పాస్ పుస్తకాలు జారీ చేశాడు. దీంతో స్థానికులు ఆర్డీవో కార్యాలయంలో అప్పీల్‌తోపాటు, ఉన్నతాధికారులను ఆశ్రయించారు. విజిలెన్స్ అధికారులు రంగం లోకి దిగి.. నాగరాజు, ధర్మారెడ్డి కలిసి పాల్పడ్డ భూ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించిన మీదట ఏసీబీ నాగరాజు, ధర్మారెడ్డి, అతని కుమారుడు తదితరులను అరెస్ట్ చేసింది.
వరుస ఆత్మహత్యలపై ఆరా
నాగరాజు ఏసీబీ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కేసు ముగిసిపోదని, యథావిధిగా దర్యాప్తు సాగుతుందని, మిగిలిన నిందితులనూ విచారిస్తామని ఏసీబీ అధికారులు అంటున్నారు. అంతలోనే మరో కీలక నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఏసీబీ ఈ కేసులో ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. వీరు నిజంగానే ఆత్మహత్యలకు పాల్పడ్డారా? ఎవరైనా అందుకు ప్రేరేపించారా? అనేది కూపీలాగేందుకు వీరి ములాఖత్, ఫోన్ రికార్డ్స్‌పై ఏసీబీ ఆరా తీస్తోందని తెలిసింది. రాజకీయ అండదండలున్న వ్యక్తులే వీరి ఆత్మహత్యకు కారణమై ఉంటారని అనుమానిస్తోంది. ఇవి ఆత్మహత్యలు కావని, రాజకీయ అండదండలున్న కొందరు వీరిని బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని కీసరవాసులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment