ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి | Completed TS Eamcet First Counseling | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తి

Published Sun, Oct 25 2020 2:40 AM | Last Updated on Sun, Oct 25 2020 2:40 AM

Completed TS Eamcet First Counseling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు ముగిసింది. నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు శనివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్‌ కోటాలో 14 యూనివర్సిటీ కాలేజీలు, 164 ప్రైవేటు కాలేజీల పరిధిలో 70,135 సీట్లు ఉన్నాయి. వీటిలో తొలివిడత కౌన్సెలింగ్‌ ద్వారా 50,137 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియలో కన్వీనర్‌ కోటాలో 71.49 శాతం సీట్లు భర్తీ కాగా, మరో 19,998 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తొలివిడత కౌన్సెలింగ్‌లో 4,603 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చినా కూడా వారికి ఏ కాలేజీలోనూ సీటు రాలేదు. తొలివిడత కౌన్సెలింగ్‌ ద్వారా మిగిలిపోయిన సీట్లను రెండో విడత కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

తొలి విడత కౌన్సెలింగ్‌ సాగిందిలా..
ఎంసెట్‌–20 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ఈనెల 12 నుంచి 22 వరకు జరిగింది. ఈనెల 20 వరకు సర్టిఫికెట్ల పరీశీలన చేయగా, 22 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంట్రీ చేశారు. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు 55,785 మంది హాజరు కాగా, 54,981 మంది విద్యార్థులు 25,20,770 ఆప్షన్లు ఎంట్రీ చేశారు. మొత్తం 50,288 సీట్లు విద్యార్థులకు కేటాయించారు.  ఇంజనీరింగ్‌ కేటగిరీలో 50,137 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 151 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 23,806 సీట్లు ఖాళీగా ఉండగా, వీటిలో ఇంజనీరింగ్‌ కేటగిరీలో 19,998 సీట్లు, ఫార్మసీ కేటగిరీలో 3,808 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

వర్సిటీ కాలేజీల్లో 98.1శాతం సీట్లు భర్తీ..
ఇంజనీరింగ్‌ కోర్సుల సీట్ల కేటాయింపులో యూనివర్సిటీ కాలేజీలు ముందు వరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో 14 వర్సిటీ కాలేజీల్లో 3,151 ఇంజనీరింగ్‌ సీట్లుండగా, వీటిలో తొలి విడత కౌన్సెలింగ్‌లో 3,091 సీట్లు విద్యార్థులకు కేటాయించారు. ప్రస్తుతం 60 సీట్లు మిగిలిపోయాయి. 164 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 66,984 సీట్లకుగాను 47,046 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 70.23 శాతం సీట్లు కేటాయించగా, 19,938 సీట్లు మిగిలిపోయాయి. 13 యూనివర్సిటీ కాలేజీలు, 35 ప్రైవేటు కాలేజీల్లో వంద శాతం సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 3 కాలేజీల్లో ఒక్క సీటు కూడా విద్యార్థులకు కేటాయించకపోవడం గమనార్హం.

ఫార్మసీ కాలేజీల్లో 4.02 శాతం కేటాయింపు..
ఫార్మసీ కాలేజీల్లో 4.02% సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ కేటగిరీలో 119 కాలేజీల్లో 3,959 సీట్లకు  151 సీట్లు కేటాయించారు. 3,808 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. 3 యూనివర్సిటీ కాలేజీల్లో 80 సీట్లు ఉండగా, 56 సీట్లు కేటాయించగా, 24 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 116 ప్రైవేటు కాలేజీల్లో 3,879 సీట్లకు గాను 95 సీట్లు కేటాయించారు. ఫార్మా–డీ కేటగిరీలో 56 ప్రైవేటు కాలేజీల్లో 546 సీట్లలో 30 కేటాయించారు. మిగతా 516 ఖాళీగా ఉన్నాయి.

ఈ కోర్సుల్లో 100 శాతం కేటాయింపు..
తొలి విడత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో పలు కోర్సు ల్లో నూరు శాతం సీట్లు కేటాయించారు. ఇందులో కెమికల్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్, డిజిటల్‌ టెక్నిక్స్‌ ఫర్‌ డిజైన్‌ అండ్‌ ప్లానింగ్, బయోమెడికల్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీమాటిక్స్, మెకానికల్‌ (మెక్‌ట్రోనిక్స్‌), కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఫుడ్‌సైన్స్, డెయిరీయింగ్, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో వంద శాతం సీట్లు కేటాయించారు.

సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తర్వాతే..
ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 28లోగా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ట్యూషన్‌ ఫీజు చెల్లించి కాలేజీలో రిపోర్టు చేయాలి. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయకుంటే కేటాయించిన సీటు రద్దవుతుంది. ఎంసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ తేదీలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అందులో పాల్గొనే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి వివరాలు పొందాలి. తొలివిడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని నిర్దేశించిన తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరై వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement