డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు  | Computer Science Course in Degree | Sakshi
Sakshi News home page

డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు 

Published Fri, May 12 2023 3:51 AM | Last Updated on Fri, May 12 2023 3:51 AM

Computer Science Course in Degree - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ప్రకటించారు. ఇది ఇంజనీరింగ్‌లో సీఎస్‌సీ కోర్సుకు సమానమని తెలిపారు. గురువారం ‘దోస్త్‌’(డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్‌ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయని, ఒక్కో కాలేజీలో 60 సీట్లతో అనుమతులిచ్చామని తెలిపారు. ఇదే తరహాలో ప్రైవేట్‌ కాలేజీలు ముందుకొస్తే వాటికీ అనుమతిస్తామన్నారు.  

కోర్సు ప్రత్యేకతలివీ... 
► ప్రస్తుతానికి డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీఎస్‌ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్‌) కోర్సును నిర్వహిస్తున్నారు. అంటే కంప్యూటర్‌ సిలబస్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా చదువుతుండగా, ఇకపై ఏకంగా పూర్తిస్థాయి కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు అందుబాటులోకి వస్తుంది. 

► ఈ కోర్సు సిలబస్, కరిక్యులం అంతా బీటెక్‌ సీఎస్‌ఈ కోర్సుతో సమానంగా ఉంటుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారు, ఎంసెట్‌కు హాజరుకాని వారు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. 

► విద్యార్థి కావాలనుకుంటే మూడేళ్లలోనే ఈ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పుడు ఆ విద్యార్థికి మూడేళ్ల డిగ్రీ పట్టా ఇస్తారు. 

► నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసే విద్యార్థులకు ఆనర్స్‌ డిగ్రీ పట్టాను జారీచేస్తారు. అమెరికా, యూకే అంతటా నాలుగేళ్ల యూజీ కోర్సులు ఉండగా, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. 

► ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ను బోధిస్తున్న అధ్యాపకులే బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్‌ కోర్సుకు బోధిస్తారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తారు. 

సెక్టార్‌ స్కిల్‌ కోర్సులు సైతం 
ఈ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుతోపాటు కొత్తగా సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ కోర్సులను సైతం ప్రవేశపెట్టనున్నారు. బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్, బీబీఏ–ఈకామర్స్‌ ఆపరేషన్స్, బీఏ కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్, బీబీఏ లాజిస్టిక్స్‌ వంటి పూర్తిస్థాయి మూడేళ్ల డిగ్రీ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సులను సైతం ‘దోస్త్‌’ద్వారానే భర్తీచేస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement