ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి మరీదు రాకేశ్ గుండెపోటుతో మృతి.
రాజస్తాన్‌కు చెందిన 18 ఏళ్ల సచిన్ హైదరాబాద్ శివార్లలోని కండ్లకోయలోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ ఆవరణలోనే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన షేక్ అహ్మద్ (36) ఇటీవలే దుబాయ్ నుంచి తిరిగొచ్చాడు. అతనికి ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కూడా ఇవి సంభవించడం కలవరపరుస్తోంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో ఆలస్యంగా అనేక దుష్ప్రభావాలు కనిపిస్తున్నట్టు అనేక తాజా అధ్యయనాల్లో వెల్లడౌతోంది. మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా రక్తం గడ్డకట్టే గుణం పెరిగేందుకు దోహదపడేలా జీవనశైలి అలవాట్లు మారడం ఇందుకు కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్యనున్న యువత ఆలస్యంగా నిద్రించడం, ఎలాంటి శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా సామాజిక మాధ్యమాల్లో, సెల్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు ఇలా వివిధరకాల డిజిటల్ పరికరాలతో కాలక్షేపం చేస్తూ మానసిక ఒత్తిడికి గురికావడం, తదితరాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆకస్మిక గుండెపోట్లకు ఎన్నో కారణాలు
ఆకస్మిక గుండెపోట్లకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. కరోనా సోకినవారికి కార్డియో వాస్క్యులర్ జబ్బులు వచ్చే అవకాశాలు అధికమయ్యాయి. కోవిడ్ సందర్భంగా తీవ్రంగా జబ్బుపడినవారికి ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతం అనేకమందిలో రక్తం గడ్డకట్టే గుణం పెరుగుతుండడం ఆందోళనకరం. గుండె జబ్బులకు అనేకరకాల వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో కారణమౌతున్నాయి.
మానసిక, పని ఒత్తిళ్లు, వాతావరణంలో వివిధరకాల కాలుష్యాలు పెరగడం, జీవనశైలి అలవాట్లు, హైప్రొటీన్ పిజ్జాలు, బర్గర్లు వంటి తిండి ఎక్కువవడం, జిమ్‌లలో అధికంగా శ్రమించడం వంటి వాటితో యువతరం గుండెపోట్ల బారిన పడడం ఇటీవల పెరిగింది. ఇక వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం ‘మయోకార్డియల్ డిస్‌ఫంక్షన్’కు కారణమవుతోంది.
యువత బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవడం, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం, అర్ధరాత్రిళ్లు, తెల్లారేదాకా మెలుకువగా ఉండడంతగ్గించాలి. ఇలాంటి వాటితో ‘సర్కాడియల్ రిథమ్’లో మార్పులొచ్చి హార్మోన్లు, మెటబాలిజమ్‌లో మార్పులొస్తున్నాయి. కుటుంబంలో గుండె సంబంధిత సమస్యలున్న వారుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
–డా. డి.శేషగిరిరావు, ప్రముఖ కార్డియాలజిస్ట్
బీపీ, షుగర్ కంటే స్ట్రెస్ డేంజర్
పోస్ట్ కోవిడ్‌లో సడెన్ కార్డియాక్ మరణాలు కొద్దిగా పెరిగాయి. దీనితో పాటు యువకుల్లో, ముఖ్యంగా కాలేజీ చదువుతున్న వారిలో ‘డ్రగ్స్ అడిక్షన్’అనేది పెరిగింది. కొకైయిన్, గంజాయి వంటి మాదకపదార్థాల వాడకం ‘కరోనరీ వాసెస్ ప్లాజె మ్’కు దారితీస్తుంది. కరోనా బారిన పడటం, డ్రగ్స్ వినియో గం వంటి వాటితో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాట్లు, డ్రగ్స్ తీసుకోవడం వంటి వల్ల హార్ట్ అటాక్‌కు ఎక్కువ అవకాశాలుంటాయి.
యంగ్ జనరేషన్ ఎక్కువగా జంక్‌ఫుడ్‌కు అలవాటు పడడం, వాయు కాలుష్యం వంటివి కూడా తోడై గుండెపోటుకు కారణమౌతున్నాయి. గతంలో 40, 50 ఏళ్లకు పైబడిన షుగర్, బీపీ వంటివి ఉన్నవారికి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లలోపు వారికే ఇలాంటి సమస్యలు ఎదురౌతున్నాయి. యువతరం కాలేజీల్లో చదువుపరంగా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. షుగర్, బీపీ వంటి వాటి కంటే కూడా స్ట్రెస్ అనేది యువకుల్లో మరింత ప్రమాదకరమైనదిగా మారింది.
గుండె జబ్బులకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. క్రీడలు ఆడేటప్పుడు ఛాతీనొప్పిగా అనిపించినా, బాగా చెమటలు పట్టినా, ఊపిరాడకపోయినా, కొంచెం అసౌకర్యంగా అనిపించినా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. స్మోకింగ్, డ్రగ్స్ వంటివి మానేయాలి. యోగ వంటివి అలవాటు చేసుకోవడం, ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, డాక్టర్ల ద్వారా సందేహాల నివృత్తి చేసుకుంటే ఇది పెద్దసమస్యగా మారకుండా జాగ్రత్త పడవచ్చు.
– డా. ఓరుగంటి సాయి సతీష్, ఫ్రొఫెసర్, కార్డియాలజీ హెడ్, యూనిట్ 1, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment