వయసుతో సంబంధం లేకుండా యువత హాట్ ఎటాక్‌తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో రావుల విజయ్ కుమార్( 33) అనే యువకుడు మృతి చెందడం ఆందోళన రేపింది.
ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యవకులు, నిరంతరం వ్యాయామం చేస్తున్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. న్యూఇయర్ పార్టీల్లోనూ, పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ, చివరకు , మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుస్తూ, కూర్చున్నవారు కూచున్నట్టుగానే కుప్పకూలిన సంఘటలను అనేకం.
ప్రధానంగా వైసీపీ నేత, ఫిట్‌నెస్ ఫ్రీక్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం విషాదాన్ని నింపింది. ఇంకా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇంకా పలువురు పోలీసు ఉన్నతాధికారులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.అతేకాదు ఈ కోవలో ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చాలామందే ఉన్నారు.
జిమ్‌కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి?
నియంత్రణ లేకుండా ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం చేయడం అనేది ఎవరికైనా ముప్పే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుందట. బాడీ ఫిట్‌గా ఉండాలనో, కండలు పెంచాలనో గంటల తరబడి జిమ్‌కే పరిమితం కాకూడదు. అంతేకాదు తొందరపాటుతో ఒక్కసారిగా జిమ్‌కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నించ కూడదు. అస్సలు నిపుణుల సలహా, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోనిదే జిమ్‌లోకి ఎంటర్ కాకూడదు.
వ్యాయామం చేస్తున్నపుడు విపరీతంగా చెమటలు పడితే తక్షణమే ఆపివేయాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్‌ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. హానికరమైన కృత్రిమ రసాయనాలు, స్టెరాయిడ్స్ వాడకంపై పూర్తి అవగాహన ముఖ్యం. ఎలాంటి దురలవాట్లు లేకుండా సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులు ధూమపానం, మద్యం సేవించడం, జంక్‌ఫుడ్స్, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు.
కరోనాతో సంబంధం ఏంటి?
భారతదేశంలో కోవిడ్ మహమ్మారి అనంతరం గుండెపోటు కేసులు, మరణాలు బాగా పెరిగియాని ఇటీవలి అధ్యయనాలు, నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా గుండెపోటు కబళిస్తోంది. కోవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఫలితంగా గుండె నాళాల్లో తీవ్ర మంట, గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక సోడియం ఉన్న ఆహారం, కనీస వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యపానం, కదలికలు లేని జీవనశైలి, అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి కారకాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment