సాక్షి ప్రతినిధి, కాకినాడ: కోవిడ్ అనంతరం గుండెపోటు మరణాలు పెనుసవాల్ విసురుతున్నాయి. కోవిడ్–19 బారినపడి పెద్దగా ప్రభావం చూపించని వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. కోవిడ్‌కు ముందు గుండెపోటు వస్తే ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరడం లేదా అవసరాన్ని బట్టి స్టెంట్స్ వేయడం, బైపాస్ సర్జరీ వంటి చికిత్సలు చేసేందుకు అవకాశం ఉండేది. గుండెపోటు వచ్చినా బయటపడేందుకు కొంత సమయం ఉండేది. కోవిడ్ తరువాత ఆ అవకాశం ఇవ్వడం లేదు.
ప్రపంచమంతటా ఇదే పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ముందు సగటు మరణాలతో పోలిస్తే కోవిడ్ తరువాత మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. యూరప్‌లో కోవిడ్ ముందు మరణాల సగటుతో పోలిస్తే.. 6 నుంచి 16 శాతం అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గుండెపోటు మరణాలే అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల 20 నుంచి 44 ఏళ్ల వారిలో గుండె జబ్బులు 30 శాతం పెరిగాయి.
ఈ విషయాన్ని అమెరికా లాస్ ఏంజెలిస్ కౌంటీ అధికారులు ప్రకటించడం గమనార్హం. విఖ్యాత వైద్య జర్నల్ ‘ది లాన్సెట్’, ‘ది ఎకనామిస్ట్’ పత్రికల నివేదికల ప్రకారం.. కోవిడ్‌కు ముందు మూడేళ్లతో పోలిస్తే.. కోవిడ్ తరువాత మూడేళ్లు (2020, 2021, 2022 సంవత్సరాలు) ప్రపంచవ్యాప్తంగా 2.50 కోట్ల మంది అధికంగా మృతి చెందారు. ఇందులో 70 లక్షల మంది కోవిడ్‌తో మరణించగా.. కోటీ80 లక్షల మంది కోవిడ్ సమయంలో ఇతర వైద్య చికిత్సలు అందక మృత్యువాతపడ్డారు.
ఏస్పిరిన్‌తో చెక్ పెట్టొచ్చు
రక్తపోటు, డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సహా పలు ఆరోగ్య సమస్యలకు ఏస్పిరిన్ చెక్ పెడుతోంది. గుండెపోటు నివారణ, గుండెపోటుకి గురయ్యే అవకాశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాలం పాటు ఏస్పిరిన్ 75 ఎంజీ వినియోగించడం సత్ఫలితాలను ఇచ్చింది. గుండెకు రక్త సరఫరా తక్కువ కావడంతో గుండె నొప్పి (ఇస్కీమియా), స్టెంట్, బైపాస్ సర్జరీ, గుండెపోటుకు గురైన వారు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన వారికి మళ్లీ గుండెపోటు రాకుండా ఏస్పిరిన్ 75 ఎంజీ రోజుకు ఒకటి చొప్పున వినియోగించటం ప్రామాణిక వైద్యం.
డిస్ప్రిన్ , అనాసిన్ పేరిట అందుబాటులో ఉండే మాత్రల్లో 325 ఎంజీ ఏస్పిరిన్ ఉంటుంది. కడుపులో అల్సర్లు, రక్తస్రావం ఇబ్బందులు ఉన్నవారు దీనిని వినియోగించకూడదు. గుండెపోటు ప్రమాదం (రిస్క్ ఫ్యాక్టర్స్) లేని వారికి ఏస్పిరిన్ శ్రేయస్కరం కాదు. మోస్తరు నుంచి అధిక కోవిడ్ నుంచి కోలుకున్న వారు 75 ఎంజీ ఏస్పిరిన్ మాత్ర భోజనం తర్వాత కనీసం రెండేళ్లు వాడాలి.
కోవిడ్ తర్వాత గుండెపోటుకు గురైన ప్రతి నలుగురిలో ఒకరికి రక్తనాళాలలో అవరోధం లేకపోయినా ఆ సమస్య వస్తోంది. ఈ సమస్యను ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు గుర్తించలేకపోతున్నాయి.
– డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ (వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జోనల్ అధ్యక్షుడు, కాకినాడ)
Comments
Please login to add a commentAdd a comment