సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా సెప్టెంబర్‌లోనే నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 29.96 లక్షల పరీక్షలు నిర్వహించగా.. అందులో 15.72 లక్షల పరీక్షలు సెప్టెంబర్ (29వ తేదీ వరకు) నెలలోనే చేసినట్లు పేర్కొంది. అంటే కరోనా వ్యాప్తి చెందిన ఈ ఏడు నెలల కాలంలో సగానికిపైగా పరీక్షలు సెప్టెంబర్‌లోనే నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది. ఆగస్టులో 9,65,253 పరీక్షలు నిర్వహించారు. మరోవైపు కేసుల సంఖ్య కూడా అత్యధికంగా ఈ ఒక్క నెలలోనే నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,91,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 63,689 కేసులు నమోదయ్యాయి.
ఇళ్లలో చికిత్స పొందుతున్నవారు 81.42 శాతం..
రాష్ట్రంలో మంగళవారం ఒక్క రోజులో 55,359 కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 2,103 మంది వైరస్ బారిన పడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఒక్క రోజులోనే 2,243 మంది కోలుకోగా, ఇప్పటి వరకు వైరస్‌బారి నుంచి బయటపడిన వారి సంఖ్య 1,60,933కు చేరింది. అలాగే ఒక రోజులో 11 మంది మృతి చెందగా, ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 1,127కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.
కోలుకున్నవారి రేటు 84.08 శాతానికి చేరుకుంది. ఇక ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 29,326 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో 23,880 మంది ఉన్నారు. అంటే ఇళ్లలో, ఇతరత్రా సంస్థల ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నవారు 81.42 శాతం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలో పది లక్షల జనాభాకు 80,494 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 298, మేడ్చల్ జిల్లాలో 176, రంగారెడ్డిలో 172, నల్లగొండలో 141, కరీంనగర్‌లో 103 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment