భవిష్యత్తు ఏందో తెలియని భార్య, పిల్లలు, పర్శరాములు (ఫైల్)
సాక్షి, కామారెడ్డి: వేలు పట్టుకుని నడిపించే నాన్న ఏమైండో తెలియని పసిపిల్లలు.. ‘మమ్మీ! డాడీ ఎప్పుడస్తడే’అంటుంటే ఆ తల్లి కన్నీళ్లతోనే సమాధానం చెబుతోంది. నాన్న ఎటుపోయిండో, అమ్మ ఎందుకు ఏడుస్తోందో ఆ చిన్నారులకు అర్థం కాదు. ఇంటి పెద్ద దిక్కును కరోనా బలిగొంటే... ఆయన ప్రాణం నిలబెట్టేందుకు తెచ్చిన అప్పు కొండలా పేరుకొని కూర్చుంది.
తానెలా బతకాలి, పిల్లలను ఎలా సాదాలో దిక్కుతోచని దయనీయ స్థితి ఆమెది. తలకొరివి పెడుతాడనుకున్న కొడుకు కళ్లముందే కాటికి పోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నరు. పండు ముదుసలి అయిన నాయినమ్మ కూడా మనవడు పోయిండని మంచం పట్టింది. దయనీయ పేద కుటుంబం విలవిల్లాడుతోంది. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
పర్శరాములు (38)ది కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామం. తల్లిదండ్రులు రాజయ్య, సత్తవ్వ.. భార్య లావణ్య, పిల్లలు అశ్విత్ (7), నిశ్విత(4)తోపాటు నాయినమ్మ సుశీలతో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపాడు. డిగ్రీ వరకు చదివిన రాములు కొంతకాలం గల్ఫ్‌కు వెళ్లి పనిచేశాడు. తర్వాత ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయం చేసేవాడు.
ఏడాది కిందట గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన అటెండర్ ఉద్యోగం సంపాదించాడు. రాములుకు ఏప్రిల్ 20న తీవ్ర జ్వరం వచ్చింది. మాచారెడ్డి పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. సాధారణ జ్వరం అనుకుని మందులు వాడాడు. ఎంతకూ తగ్గకపోవడంతో మూడు రోజులకు మళ్లీ పరీక్ష చేయించుకున్నాడు. అప్పుడు కూడా నెగెటివ్ వచ్చింది.
నీరసం కూడా పెరగడంతో 24న కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి సీటీ స్కాన్ చేయించుకున్నాడు. కరోనాతో ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు తేలింది. దీంతో అదే రోజు ఆస్పత్రిలో చేరాడు. అక్కడ ఆరు రోజుల పాటు ఉన్నాడు. తరువాత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో 29న రాత్రి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆçస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రూ.18 లక్షల బిల్లు అయ్యింది. అక్కడా ఇక్కడా అప్పు తెచ్చి కట్టేశారు. చివరకు కరోనాతో పోరాడి రాములు గత నెల 15న కన్నుమూశాడు. ఇతర మందులు, అంబులెన్స్‌లకు మరో రూ. 3 లక్షలు ఖర్చయింది. మొత్తంగా రూ.21 లక్షలైంది.
కొడుకును బతికించుకుందామని..
ఒక్కగానొక్క కొడుకును బతికించుకుందామని ఎన్ని పైసలైనా సరే అని తెలిసిన వాళ్ల దగ్గర, సుట్టాల దగ్గర పైసలు తెచ్చి కట్టినం. డాక్టర్లు మంచిగైతడనే చెప్పిండ్రు. పైసలు పోయినా పాణం దక్కాలని దేవుండ్లకు మొక్కినం. ఆఖరుకు కొడుకును కరోనా గద్దలెక్క తన్నుకుపోయింది. ఇప్పుడు మాకు దిక్కెవరు. భూమి అమ్మినా అప్పు తీరేటట్టు లేదు.
–తండ్రి రాజయ్య
మా బతుకులు ఆగం
ఆయన అందరితో మంచిగ ఉండెటోడు. ఇంట్లో ఎవలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటోడు. కరోనా ఆయన్ను మింగి మా బతుకులను ఆగం జేసింది. పిల్లలు డాడీ ఎప్పుడస్తడే అని అడుగుతుంటే ఏం చెప్పాలి. మా అత్త, మామలు, నేను ఎట్ల బతకాలో అర్థమైతలేదు.
–భార్య లావణ్య
చదవండి: థర్డ్‌వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం!
Comments
Please login to add a commentAdd a comment