యోధులూ ముందుకు రండి.. విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్.. మొన్నటి వరకూ లాక్‌డౌన్‌లో కోవిడ్ నియంత్రణపై పూర్తి సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం కోవిడ్ బారిన పడి ప్రాణాపాయంతో ఉన్నవారికి ప్లాస్మాను ఇచ్చే దిశగా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రోజూ తానే స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ముందుకొచ్చి ప్రాణాలు నిలిపిన వారిని ప్లాస్మా యోధాతో సత్కరిస్తున్నారు. తొలుత ప్లాస్మా సేకరణ పోలీస్ నుంచి ప్రారంభించి ప్రస్తుతం ముందుకు వచ్చే అందరితో సేకరిస్తున్నారు. ఈ విషయమై సజ్జనార్ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ.. కోవిడ్ వైరస్‌ను ఓడించి నిలిచిన వారంతా.. ప్లాస్మా దానం చేసి మరో ప్రాణాన్ని నిలబెట్టాలని, ప్లాస్మా ఇచ్చేవారు 94906 17444నుసంప్రదిస్తే అంతా తామే సమన్వయం చేస్తామన్నారు.
సాక్షి, హైదరాబాద్: మనిషి ప్రాణానికి మించింది ప్రపంచంలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. సర్వావస్థల్లో, సకల కాలాల్లో అన్నింటికి కంటే ప్రధానమైది అదే. కళ్లెదుటే ఓ నిండు ప్రాణం పోతున్నా.. స్పందించకపోతే మనుషులకు విలువే ఉండదు. అయినా ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఇప్పటి వరకు వైద్యులకే ఉండేది. కానీ ‘డెంగీతో నేనూ మరణం చివరి అంచుల వరకూ వెళ్లివచ్చి ప్రస్తుతం ప్రాణ దాతనయ్యా.. ఇప్పటి వరకు మూడుసార్లు ప్లాస్మాను దానం చేశా.. ఈ జీవితానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది’ అని 23 ఏళ్ల పి.ఉదయ్‌కిరణ్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేస్తే.. మరోవైపు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ వైరస్‌తో వైద్యులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరి అస్త్రంగా ప్లాస్మాను ప్రయోగించారు. ప్రాణంపై ఆశ వదులుకున్న దశలో ఓ 60 ఏళ్ల వ్యక్తి మళ్లీ రికవరీ అయి వారం రోజుల్లో డిశ్చార్జి అయ్యారు. ఈ తరహాలో గుప్తా పదిహేను రోజుల్లో మూడుసార్లు ప్లాస్మా దానం చేశారు. గుప్తా బాటలో అనేక మందిని నడిపించేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, గాంధీ ఆస్పత్రి, ప్మాస్మా డోనర్స్ అసోసియేషన్లు చేస్తున్న కృషితో ‘మిషన్ ప్లాస్మా క్లబ్’లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది.
కొత్త జీవితానికి నాంది..
సరైన మందుల్లేని కరోనా వైరస్‌పై వివిధ రకాలుగా యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్లాస్మా పదునైన ఆయుధంగా మారింది. ఏ మందు ప్రయోగించినా ఫలితం రాని సమయంలో ప్లాస్మాను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 36 మంది వద్ద ప్లాస్మా తీసుకుని 25 మందికి కొత్త లైఫ్ ఇవ్వగా.. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఏకంగా స్పెషల్ సెల్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 213 మంది దాతల నుంచి ప్లాస్మాను సేకరించి 370 మందికి పునర్జన్మ ప్రసాదించారు. కోవిడ్ వైరస్ బారిన పడి కోలుకున్న వెయ్యి మంది వివరాలు సేకరించిన సైబరాబాద్ పోలీసులు మరో వైపు ప్లాస్మా కావాల్సిన వారి వివరాలను సైతం ప్రత్యేక సెల్‌లో నమోదు చేసి దాతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ప్లాస్మా ఇచ్చేవారు 50 ఏళ్లు లోపువారై ఉండి, పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధనతో ముందుకు వస్తున్నవారి సంఖ్య 25 శాతానికి దాటడం లేదు. గడిచిన వారం రోజుల్లో ప్లాస్మా ఇచ్చేందుకు ఎవరికి వారే ముందుకు వస్తున్న తీరు ప్లాస్మా అవసరం ఉన్న కుటుంబాల్లో కొత్త ఆశలు నింపుతోంది.
ప్రాణం విలువ తెలిసింది.. అందుకే
‘నాకు డెంగీ వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ దొరకలేదు. ఒక దశలో మరణం చివరి అంచుల వరకు వెళ్లా.. అయినా బతికిపోయా. ప్రాణం విలువ అప్పుడే తెలిసింది. అందుకే మన చేతుల్లో ప్రాణం పోసే శక్తిని అవసరమైన వారికి ఉపయోగిస్తాం. ఇప్పటికే మూడుసార్లు ప్లాస్మా ఇచ్చా.’ – ఉదయ్‌కిరణ్ గుప్తా, ప్లాస్మా దాత, షాద్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment