సురక్షితంగా గమ్యం చేరే వరకు పోలీసు పర్యవేక్షణ
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో డయల్ 100/112, యాప్, వెబ్‌పేజీ సేవలు
స్మార్ట్‌ఫోన్లతో పాటు సాధారణ ఫోన్‌తోనూ టీ–సేఫ్ వినియోగం
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ప్రయాణించే పౌరులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గమ్య స్థానం చేరే వరకు పర్యవేక్షించేలా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు టీ–సేఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. స్మార్ట్‌ఫోన్ లేక పోయినా, సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నా..ఈ టీ–సేఫ్ సేవలను వినియోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, కీలకమైన సర్వీస్ అని అన్నారు.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మహిళా శక్తి విధానం ఆవిష్కరణలో భాగంగా మంగళవారం సచివాల యంలో టీ–సేఫ్‌ను సీఎం ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, డి.అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఐవీఆర్ ఆప్షన్‌లో 8 నంబర్‌ను నొక్కడం ద్వారా టీ–సేఫ్ సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.
ఒక్కసారి సమాచారం ఇస్తే చాలు
స్మార్ట్ ఫోన్లు ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం, లేదా టీ–సేఫ్ వెబ్‌పేజీ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారుల సురక్షిత ప్రయాణం కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం అభినందనలు తెలిపారు.
టీ–సేఫ్‌కు డయల్ 100 ద్వారా లేదా యాప్ ద్వారా ఒకసారి సమా చారం ఇస్తే సరిపోతుందని, మళ్లీ మళ్లీ అత్యవసర సేవల కోసం 100 నంబర్‌కు ఫోన్ చేయాల్సిన పని లేకుండా పోలీసులే నిర్ధారిత సమయంలోపు పౌరులను సంప్రదిస్తూ వారు సురక్షితంగా గమ్యం చేరే వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని ప్యాట్రో వాహ నాలకు సైతం వెళుతుందని వివరించారు.
లైవ్ లొకేషన్ పంపే వీలు
టీ–సేఫ్ యాప్‌ను వినియోగించే పౌరులు ఆపదలో ఉన్నప్పుడు వారి లైవ్ లొకేషన్‌ను పోలీసులకు పంపే వీలు కూడా ఉందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 791 ప్యాట్రో కార్లు, 1,085 బ్లూకోల్ట్స్ వాహనాలకు టీ–సేఫ్ అనుసంధానమై ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత సురక్షిత ప్రయాణం కోసం టీ–సేఫ్ యాప్ సేవలను ఇతర క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సేవల యాప్‌లకు అనుసంధానిస్తామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్‌రెడ్డి, శిక్షణ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment