సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో నాగార్జునసాగర్‌తోపాటు కల్వకుర్తి, భీమా, పాలేరు, వైరా, మల్లూరు, లంకాసాగర్, గొల్లవాగు ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ (స్కివం) కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుత నీటి లభ్యత ఆధారంగా పెద్ద చిన్న ప్రాజెక్టులన్నింటి కింద కలిపి 28.95 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని సరఫరా చేయగలమని తేల్చింది.
ఈ ఏడాది వర్షాభావంతో ఎగువ నుంచి ఆశించిన వరద రాక కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇతర ప్రాజెక్టుల్లో నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ (వానాకాలం) పంటల సాగే కష్టంగా కొనసాగింది. కొంత మేర ఉన్న నీళ్లూ దీనికే సరిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని స్కివం కమిటీ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఆయకట్టు విస్తీర్ణం, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని యాసంగి సీజన్‌లో ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించాలనే అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ నేతృత్వంలో బుధవారం జలసౌధలో స్కివం కమిటీ సమావేశమై ప్రతిపాదనలను సిద్ధం చేసింది. 2023–24 యాసంగిలో 28.95 లక్షల ఎకరాలకు 215 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది యాసంగి లక్ష్యం 33.46 లక్షల ఎకరాలకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం.
సాగర్ ఎడమ కాల్వ పరిధిలో కరువు
నాగార్జున సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 157.61 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజీకిపైన వినియోగించుకోగలిగిన నీరు చాలా తక్కువ. దీనితో సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టుకు నీరివ్వలేమని అధికార యంత్రాంగం తేల్చింది. ఎడమ కాల్వ కింద మొత్తంగా 6.40లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులోనూ 57 టీఎంసీలే నీళ్లు ఉండటంతో.. ఏఎమ్మార్పి, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీరివ్వలేని పరిస్థితి. కేవలం నెట్టెంపాడు కింద 5వేల ఎకరాలకు, మూసీ ప్రాజెక్టు కింద 30వేల ఎకరాలకే సాగునీరు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు.
గోదావరి బేసిన్‌లో కాస్త మెరుగ్గా..
గోదావరి బేసిన్ పరిధిలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద దాదాపు 11.55లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం 90టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 78.66 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 6.50 టీఎంసీలను తాగునీటికి, మిగతా నీటిని యాసంగి పంటల కోసం కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద మొత్తంగా 9,65,013 ఎకరాలు ఉన్నా.. 8,28,297 ఎకరాలకే సాగునీరివ్వాలని లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందులో 3.87 లక్షల ఎకరాలు ఆరుతడి పంటలకు, 4.41 లక్షల ఎకరాలు తరి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు.
ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు: స్కివం కమిటీ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల తేదీలను ఖరారు చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో.. అంటే 8 రోజులు నీటి విడుదల చేస్తూ, 7 రోజులు ఆపుతూ ఇస్తారు. ఇప్పటికే ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment