సాక్షి, హైదరాబాద్: ఆయా కేసుల దర్యాప్తునకు నిందితుల ఫోన్లే ఆధారంగా మారుతున్నాయి. ఇటీవల దాదాపు ప్రతి కేసులోనూ కీలకాధారాలు నిందితుల ఫోన్ల నుంచే లభిస్తున్నాయి. వైట్ కాలర్ అఫెన్సులుగా పిలిచే మోసాలకు సంబంధించిన కేసుల్లో వీటి విశ్లేషణ అనివార్యం, అత్యంత కీలకం. ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ కేసులోనూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల ఫోన్లను విశ్లేషణ చేస్తున్నారు. కీలక నిందితుడైన చైనీయుడు యాన్ హూ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో చాటింగ్స్ మొత్తం చైనా భాషలో ఉన్నాయి. దీంతో గూగుల్ లెన్స్ యాప్ సాయంతో అందులోని వివరాలను సంగ్రహిస్తున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పేటీఎం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరాలు సేకరించారు.
డాకీపే పేరిట వాట్సాప్ గ్రూప్
సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం అతడితోపాటు ముగ్గురు ఢిల్లీవాసుల్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి వాట్సాప్‌ను పరిశీలించగా డాకీపే అంటూ ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఓ గ్రూప్ కనిపించింది. గ్రూప్ పరిశీలించగా అందులో యాన్ హూ ఇచ్చిన సందేశాలతోపాటు ఇతరులు చేసిన చాటింగ్స్ కూడా చైనా భాషలోనే ఉన్నాయి.
దీంతో ఆ చాటింగ్స్‌లోని అంశాలను తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ లెన్స్ యాప్‌ను వాడుతున్నారు. అందులో చైనా భాషలో ఉన్న వివరాలను ఇంగ్లిష్‌లో చూపిస్తోంది. ఇందులో లభించిన అంశాలను బట్టే ఢిల్లీకి చెందిన ఎనిమిది సంస్థలకు ఐసీఐసీఐ బ్యాంకులోనూ మరో ఖాతా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఫ్రీజ్ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
చార్జ్‌షీట్‌కు చాటింగ్స్ వివరాలు కీలకం
సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికీ ఈ చాటింగ్స్‌లోని వివరాలు కీలకం. గూగుల్ లెన్స్‌ను వాడుతున్నాం. అధికారిక ట్రాన్స్‌లేటర్ ద్వారా తర్జు మా చేయించి, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జత చేసి దాఖలు చేయాల్సి ఉంటుంది’అని అన్నారు.
బెట్టింగ్స్‌తో రూ.1,107 కోట్లు
నిందితులు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1,107 కోట్లు బెట్టింగ్స్ ద్వారా ఆర్జించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీటిలో రూ.110 కోట్లు ఇప్పటికే చైనాకు వివిధ మార్గాల్లో తరలిపోయాయి. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.30 కోట్లను ఇప్పటికే అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగిలిన రూ.967 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇవి హవాలా మార్గంలో వెళ్ళాయా? లేక ఇంకా గుర్తించాల్సిన బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? అనేది ఆరా తీస్తున్నారు.
కలర్ ప్రిడెక్షన్‌ను పేమెంట్ గేట్ వేగా పని చేసిన పేటీఎంకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హాజరైన ఈ ప్రతినిధులు తమ యాప్ ద్వారా కలర్ ప్రిడెక్షన్‌కు సంబంధించి రూ.649 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటిని ఆ సంస్థకు చెందని రెండు ఖాతాల్లోకి మళ్ళించామని వెల్లడించారు. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చిన సొమ్మునూ తాము క్రోడీకరించి హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్లు అంగీకరించారు. మరిన్ని వివరాల కోసం ఈ సంస్థ ప్రధాన కార్యాలయానికి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment