Cyber cops
-
కొత్త తరహా మోసానికి తెరలేపిన మోసగాళ్ళు.. మెసేజ్ చూసి..
ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా నకిలీ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళను డబ్బులు అడగటం వంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది వాట్సాప్ వేదికగా మోసాలు చేయడానికి పూనుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. 'మీరు మెసేజ్ చూసాక ఫోన్ చేయండి.. ధన్యవాదాలు' అంటూ అధికారులు పంపించినట్లు మెసేజులు చాలామందికి వచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కి మాత్రమే కాకుండా ఇలాంటి మెసేజులు ఇతర ఏ యాప్స్‌కి వచ్చినా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ మెసేజులు చూసి ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. కావున వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో విదేశాల నెంబర్ కోడ్స్‌తో ఫేక్ కాల్స్ వచ్చేవి. ఇలాంటి వాటి వల్ల కూడా చాలామంది డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే? నిజానికి మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ గానీ, ఫోన్ గానీ వచ్చినట్లయితే.. వాటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్స్‌ని బ్లాక్ చేసుకోవడం మంచిది. అంతే కాకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్‌లో ఫ్రీ వై-ఫై ఉపయోగించుకోకుండా ఉండటం ఉత్తమం. -
గేమింగ్ కేసుపై గూగుల్ లెన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆయా కేసుల దర్యాప్తునకు నిందితుల ఫోన్లే ఆధారంగా మారుతున్నాయి. ఇటీవల దాదాపు ప్రతి కేసులోనూ కీలకాధారాలు నిందితుల ఫోన్ల నుంచే లభిస్తున్నాయి. వైట్ కాలర్ అఫెన్సులుగా పిలిచే మోసాలకు సంబంధించిన కేసుల్లో వీటి విశ్లేషణ అనివార్యం, అత్యంత కీలకం. ఈ–కామర్స్ ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ కేసులోనూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల ఫోన్లను విశ్లేషణ చేస్తున్నారు. కీలక నిందితుడైన చైనీయుడు యాన్ హూ నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లో చాటింగ్స్ మొత్తం చైనా భాషలో ఉన్నాయి. దీంతో గూగుల్ లెన్స్ యాప్ సాయంతో అందులోని వివరాలను సంగ్రహిస్తున్నారు. మరోపక్క ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పేటీఎం ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరాలు సేకరించారు. డాకీపే పేరిట వాట్సాప్ గ్రూప్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం అతడితోపాటు ముగ్గురు ఢిల్లీవాసుల్నీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అతడి వాట్సాప్‌ను పరిశీలించగా డాకీపే అంటూ ఇంగ్లిష్‌లో రాసి ఉన్న ఓ గ్రూప్ కనిపించింది. గ్రూప్ పరిశీలించగా అందులో యాన్ హూ ఇచ్చిన సందేశాలతోపాటు ఇతరులు చేసిన చాటింగ్స్ కూడా చైనా భాషలోనే ఉన్నాయి. దీంతో ఆ చాటింగ్స్లోని అంశాలను తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ లెన్స్ యాప్‌ను వాడుతున్నారు. అందులో చైనా భాషలో ఉన్న వివరాలను ఇంగ్లిష్‌లో చూపిస్తోంది. ఇందులో లభించిన అంశాలను బట్టే ఢిల్లీకి చెందిన ఎనిమిది సంస్థలకు ఐసీఐసీఐ బ్యాంకులోనూ మరో ఖాతా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ఫ్రీజ్ చేయించడానికి చర్యలు తీసుకుంటున్నారు. చార్జ్‌షీట్‌కు చాటింగ్స్ వివరాలు కీలకం సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికీ ఈ చాటింగ్స్లోని వివరాలు కీలకం. గూగుల్ లెన్స్‌ను వాడుతున్నాం. అధికారిక ట్రాన్స్‌లేటర్ ద్వారా తర్జు మా చేయించి, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జత చేసి దాఖలు చేయాల్సి ఉంటుంది’అని అన్నారు. బెట్టింగ్స్‌తో రూ.1,107 కోట్లు నిందితులు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1,107 కోట్లు బెట్టింగ్స్ ద్వారా ఆర్జించినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీటిలో రూ.110 కోట్లు ఇప్పటికే చైనాకు వివిధ మార్గాల్లో తరలిపోయాయి. వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.30 కోట్లను ఇప్పటికే అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగిలిన రూ.967 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇవి హవాలా మార్గంలో వెళ్ళాయా? లేక ఇంకా గుర్తించాల్సిన బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? అనేది ఆరా తీస్తున్నారు. కలర్ ప్రిడెక్షన్‌ను పేమెంట్ గేట్ వేగా పని చేసిన పేటీఎంకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సైబర్ క్రైమ్ ఠాణాలో హాజరైన ఈ ప్రతినిధులు తమ యాప్ ద్వారా కలర్ ప్రిడెక్షన్కు సంబంధించి రూ.649 కోట్ల లావాదేవీలు జరిగాయని, వీటిని ఆ సంస్థకు చెందని రెండు ఖాతాల్లోకి మళ్ళించామని వెల్లడించారు. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా వచ్చిన సొమ్మునూ తాము క్రోడీకరించి హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాల్లోకి పంపినట్లు అంగీకరించారు. మరిన్ని వివరాల కోసం ఈ సంస్థ ప్రధాన కార్యాలయానికి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాయనున్నారు. -
భారత క్రికెటర్‌కు షాక్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అయిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణా మెట్లు ఎక్కారు. ఆయన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేశారు. అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ నేతృత్వంలోని బృందం కొన్ని గంటల్లోనే బాధ్యుడిని గుర్తించింది. అతడు సిరాజ్‌కు పరిచయస్తుడే కావడంతో కేసు వద్దని చెప్పిన ఆయన ఫిర్యాదు ఉపసంహరించుకున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు క్రికెటర్ సిరాజ్ ఎంపికయ్యాడు. యువ క్రికెటర్ కావడంతో ఈయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఫేస్‌బుక్‌లోనూ పెద్ద సంఖ్యలోనే ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఉంది. ఇందులో భాగంగానే ఓ 14 ఏళ్ల బాలుడు సైతం సిరాజ్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఆ బాలుడు క్రికెటర్ కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో తేలిగ్గా సిరాజ్ ఫేస్బుక్ పాస్వర్డ్ తెలుసుకున్నాడు. ఆయన అనుమతి లేకుండా ఖాతాలోకి ప్రవేశించిన బాలుడు దాని నుంచి ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న కొందరికి సందేశాలు పంపాడు. ఈ విషయం గుర్తించిన సిరాజ్ తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడే హ్యాకర్ అని గుర్తించిన అధికారులు విషయం సిరాజ్‌కు వివరించారు. అతడు తన కుటుంబీకులకు పరిచయస్తుడు కావడంతో కేసు వద్దని పోలీసులకు చెప్పిన సిరాజ్ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. -
సైబర్ కాప్స్ అదుపులో అంతర్రాష్ట్ర పైరసీ ముఠా!
- బాహుబలి–2 పైరసీ చేసినట్లు పక్కా ఆధారాలు - బిహార్‌లోని పట్నా కేంద్రంగా సాగిన వ్యవహారం సాక్షి,హైదరాబాద్: సినిమాల పైరసీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. బిహార్ రాజధాని పట్నా కేంద్రంగా ఈ ముఠా తమ వ్యవహారాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల విడుదలైన బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన ఓ వ్యక్తి ఏకంగా చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యక్తికే కొన్ని నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను పంపి.. తాను అడిగినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే సినిమా అంతటినీ ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి పైరసీని గుర్తించారు. పట్నాలో థియేటర్లోనే పైరసీ: పైరసీ బారిన పడకుండా ఇటీవల కీలక చిత్రాలను ప్రధాన సర్వర్‌తో అనుసంధానించి, శాటిలైట్ సిగ్నల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సదరు సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లకు నిర్మాతలు ప్రత్యేక కోడ్‌ను ఇచ్చి ప్రధాన సర్వర్ నుంచే చిత్రం ప్రదర్శితమయ్యేలా చేస్తారు. ఈ తరహాలోనే పట్నాలోని ఓ థియేటర్లో బాహుబలి–2 ప్రదర్శితమైంది. ఆ థియేటర్లో సాంకేతిక వ్యవహారాలు చూసే ఓ వ్యక్తి స్వయంగా పైరసీకి పాల్పడినట్లు తేలింది. ఇతడితో ముఠా కట్టిన ఢిల్లీ, హైదరాబాద్‌లకు చెందిన మరికొందరు బెదిరింపు దందాకు దిగారు. ఆదివారం రాత్రి నాటికి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
ఫేస్బుక్లో సైబర్ కాప్స్
సైబర్ క్రైమ్ పోలీసు హైదరాబాద్ పేరుతో హోమ్ పేజ్ నెట్‌జనులకు విస్తృత అవగాహనే థ్యేయం నేడు ఆవిష్కరించనున్న నగర కమిషనర్ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ‘‘ఆన్లైన్ ద్వారా నేరం చేసిన వారూ తప్పించుకోలేరు. సైబర్ పోలీసులు కన్నేసి ఉంచారు’’- సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజ్ నినాదమిది. ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ఆధారంగా ఆన్లైన్లో జరుగుతున్న నేరాలపై నెట్‌జనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్బుక్ పేజ్‌ను ఏర్పాటు చేసింది. ‘సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ పేజ్‌ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పేజ్ని 12 గంటల్లోనే 14 మంది లైక్ చేశారు. ఈ పేజ్ ద్వారా ప్రాథమికంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఒకే తీరులో ఒకటి కంటే ఎక్కువ నేరాలు నమోదైతే తక్షణం ఆ వివరాలను ఫేస్బుక్ పేజ్‌లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తం చేస్తారు. ఈ తరహా నేరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరించేందుకు ‘అలెర్ట్స్’ను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో బాధితులు సంప్రదింపులు జరపడానికి, సందేహాలు తీర్చుకోవడానికీ ఈ పేజ్ ఉపయోగపడేలా చేయాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నిర్ణయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి వచ్చే నేరాలను మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. అయితే ప్రస్తుతం బాధితులకు ఏ తరహా నేరం ఈ చట్టపరిధిలోకి వ స్తుందనేది స్పష్టంగా తెలియట్లేదు. ఫలితంగా సమయం, ఖర్చుల్ని వెచ్చిస్తూ సీసీఎస్ వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఫేస్బుక్ పేజ్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అమలైతే ఓ బాధితుడు తాను మోసపోయిన తీరు, ఎదుర్కొన్న ఇబ్బంది తదితరాలను సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్బుక్ పేజీలో నిర్దేశించిన ప్రాంతంలో పొందుపరిస్తే... వాటిని పరిశీలించే పోలీసులు అవసరమైన సహాయసహకారాలు అందిస్తారు. దశల వారీగా ఈ విధానాన్ని అమలులోకి తేనున్నారు.