ఫేస్‌బుక్‌లో సైబర్ కాప్స్
- సైబర్ క్రైమ్ పోలీసు హైదరాబాద్ పేరుతో హోమ్ పేజ్
- నెట్‌జనులకు విస్తృత అవగాహనే థ్యేయం
- నేడు ఆవిష్కరించనున్న నగర కమిషనర్ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆన్‌లైన్ ద్వారా నేరం చేసిన వారూ తప్పించుకోలేరు. సైబర్ పోలీసులు కన్నేసి ఉంచారు’’- సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్‌బుక్ పేజ్ నినాదమిది. ఇటీవల కాలంలో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఇంటర్‌నెట్ ఆధారంగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న నేరాలపై నెట్‌జనులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్ పేజ్‌ను ఏర్పాటు చేసింది.
‘సైబర్ క్రైమ్ పోలీస్ హైదరాబాద్’ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ పేజ్‌ను నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శనివారం తన కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు. శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ పేజ్‌ని 12 గంటల్లోనే 14 మంది లైక్ చేశారు. ఈ పేజ్ ద్వారా ప్రాథమికంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. ఒకే తీరులో ఒకటి కంటే ఎక్కువ నేరాలు నమోదైతే తక్షణం ఆ వివరాలను ఫేస్‌బుక్ పేజ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రజలు అప్రమత్తం చేస్తారు.
ఈ తరహా నేరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరించేందుకు ‘అలెర్ట్స్’ను అందుబాటులోకి తేనున్నారు. భవిష్యత్తులో బాధితులు సంప్రదింపులు జరపడానికి, సందేహాలు తీర్చుకోవడానికీ ఈ పేజ్ ఉపయోగపడేలా చేయాలని సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు నిర్ణయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి వచ్చే నేరాలను మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు.
అయితే ప్రస్తుతం బాధితులకు ఏ తరహా నేరం ఈ చట్టపరిధిలోకి వ స్తుందనేది స్పష్టంగా తెలియట్లేదు. ఫలితంగా సమయం, ఖర్చుల్ని వెచ్చిస్తూ సీసీఎస్ వరకు వచ్చి వెళ్లాల్సి వస్తోంది. దీనికి పరిష్కారంగా ఫేస్‌బుక్ పేజ్‌ను తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది అమలైతే ఓ బాధితుడు తాను మోసపోయిన తీరు, ఎదుర్కొన్న ఇబ్బంది తదితరాలను సైబర్ క్రైమ్ పోలీసుల ఫేస్‌బుక్ పేజీలో నిర్దేశించిన ప్రాంతంలో పొందుపరిస్తే... వాటిని పరిశీలించే పోలీసులు అవసరమైన సహాయసహకారాలు అందిస్తారు. దశల వారీగా ఈ విధానాన్ని అమలులోకి తేనున్నారు.