- బాహుబలి–2 పైరసీ చేసినట్లు పక్కా ఆధారాలు
- బిహార్‌లోని పట్నా కేంద్రంగా సాగిన వ్యవహారం
సాక్షి,హైదరాబాద్: సినిమాల పైరసీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. బిహార్ రాజధాని పట్నా కేంద్రంగా ఈ ముఠా తమ వ్యవహారాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల విడుదలైన బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన ఓ వ్యక్తి ఏకంగా చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యక్తికే కొన్ని నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను పంపి.. తాను అడిగినంత మొత్తాన్ని చెల్లించాలని లేదంటే సినిమా అంతటినీ ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేసి పైరసీని గుర్తించారు.
పట్నాలో థియేటర్‌లోనే పైరసీ: పైరసీ బారిన పడకుండా ఇటీవల కీలక చిత్రాలను ప్రధాన సర్వర్‌తో అనుసంధానించి, శాటిలైట్ సిగ్నల్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నారు. సదరు సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లకు నిర్మాతలు ప్రత్యేక కోడ్‌ను ఇచ్చి ప్రధాన సర్వర్ నుంచే చిత్రం ప్రదర్శితమయ్యేలా చేస్తారు. ఈ తరహాలోనే పట్నాలోని ఓ థియేటర్‌లో బాహుబలి–2 ప్రదర్శితమైంది. ఆ థియేటర్‌లో సాంకేతిక వ్యవహారాలు చూసే ఓ వ్యక్తి స్వయంగా పైరసీకి పాల్పడినట్లు తేలింది. ఇతడితో ముఠా కట్టిన ఢిల్లీ, హైదరాబాద్‌లకు చెందిన మరికొందరు బెదిరింపు దందాకు దిగారు. ఆదివారం రాత్రి నాటికి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
సైబర్ కాప్స్ అదుపులో అంతర్రాష్ట్ర పైరసీ ముఠా!
Published Mon, May 15 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
Advertisement