సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి గురువారం ఉదయం అల్పపీడనంగా మారిందని, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా, అల్పపీడనం సముద్ర మట్టం నుంచి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తున పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఈనెల 22 నాటికి మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని, ఈనెల 23 నాటికి తీవ్రవాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ గురువారం నివేదికలో పేర్కొంది. తీవ్ర వాయుగుండం దిశను మార్చుకుంటూ ఉత్తర దిశగా కదలుతూ ఈ నెల 24 నాటికి పశ్చిమ మధ్య, బంగాళాఖాతం దాని పరిసరప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 25 నాటికి పశ్చిమబెంగాల్–బంగ్లాదేశ్ తీరానికి చేరుకుంటుందని పేర్కొంది.
రానున్న రెండ్రోజుల్లో వర్షాలు
ప్రస్తుతం రాష్ట్రానికి తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని చాలాప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ జరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment