ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లిలో వరదకు ధ్వంసమైన పత్తి చేను
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: గులాబ్ తుపాను వల్ల కురిసిన భారీ వర్షంతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు, వంకలు పొంగడంతో అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతకుమించి వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అనధికార సమాచారం. నిజామాబాద్, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, ములుగు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగినట్టుగా అంచనా వేసినట్లు సమాచారం. ఇతర జిల్లాల్లో మోస్తరు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
మొత్తంగా ఈ వానాకాలంలో ఇప్పటివరకు 12.80 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినటు సమాచారం. కాగా తాజా వర్షాలతో వరి, పత్తి, సోయా, మొక్కజొన్న, పొగాకు, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. రహదారులపై వరద ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకు పైగా చెరువులు నిండినట్లు సమాచారం. కాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో పరిస్థితి సమీక్షించి, సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
నిజామాబాద్‌లో అత్యధిక సగటు వర్షపాతం
నిజామాబాద్ జిల్లాలో సోమవారం 20.4 సెంటీమీటర్ల అత్యధిక సగటు వర్షపాతం నమోదయ్యింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి, మంజీర పరీవాహక ప్రాంతాల్లోని బోధన్, నవీపేట, నందిపేట మండలాల్లో పంటలు భారీగా నీటమునిగాయి. జిల్లాలో 7,943 ఎకరాల్లో వరి, 1,551 ఎకరాల్లో సోయా, 402 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో పొగాకు పంటలు దెబ్బత్నిట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. చెరువులు భారీగా పొంగి ప్రవహిస్తుండడంతో అనేక చోట్ల లోలెవల్ వంతెనల పైనుంచి నీరు ప్రవహించింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి తండా చెరువులో పడి ఒకరు మృతి చెందారు.
నీట మునిగిన బాసర బైపాస్ వంతెన
భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల్ వద్ద బోరపు వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదలో భారత్ గ్యాస్‌కు చెందిన 200 నిండు సిలిండర్లతో ఉన్న లారీ కొట్టుకుపోయింది. డ్రైవర్‌ను పోలీసులు, స్థానికులు రక్షించారు. ముత్తకుంట గ్రామ శివా రులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న వరదలో లారీ చిక్కుకుపోగా అందులోని ఏడుగురు కూలీ లను గ్రామస్తులు రక్షించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు పలు ప్రాంతాల్లో పర్యటించారు.
నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత
కామారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జుక్కల్‌లో 14.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని లింగాపూర్‌లో మంగళవారం పందిరి భగవాన్‌రెడ్డి (54) అనే రైతు మోపెడ్‌పై కూరగాయలు విక్రయిం చి తిరిగివస్తూ వరదలో కొట్టుకుపోయాడు. గ్రామస్తులు గాలించగా మృతదేహం లభించింది.
నిర్మల్‌కు మళ్లీ వాన దెబ్బ
రెండునెలల క్రితమే జడివానతో దెబ్బతిని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మల్ జిల్లాను గులాబ్ తుపాన్ మళ్లీ దెబ్బకొట్టింది. వేల ఎకరాల్లో పంటను వరద ముంచెత్తింది. గోదావరి, స్వర్ణ, కడెం, సుద్ధవాగులు పోటెత్తడంతో తీరప్రాంతాల్లో పంటలకు భారీగానే నష్టం వాటిల్లింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తడంతో దిగువన గల సోన్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల్లోని వందల ఎకరాల్లో పంటపొలాలు నీటమునిగాయి. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిలిచే ప్రాంతంలో కూడా పంటలు నీట మునిగాయి.
ఎస్సారెస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మంగళవారం ఉదయం వరద ఉధృతి పెరి గింది. దీంతో 33 వరద గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (90 టీఎం సీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి 1088.90 అడుగుల వద్ద 79 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
ట్రాక్టర్‌పై బయటకు వచ్చిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి వరద నీటిలో చిక్కింది. కలెక్టరేట్ భవనం పక్కనే ఉన్న క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి నివాసం ఉంటున్నారు. ఆయన మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వరదలను పరిశీలించడంతో పాటు బాధితుల పరామర్శకు సిద్ధమయ్యారు. కానీ చుట్టూ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో కారులో బయటకు రావడం సాధ్యం కాలేదు. దీంతో ట్రాక్టర్ తెప్పించుకుని బయటకు వచ్చి పట్టణంలో పర్యటించారు.
రాష్ట్రంలో 50.6 మి.మీ సగటు వర్షపాతం
సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలో సగటున 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 4.5 మి.మీ కాగా రోజంతా కురిసిన వానతో కొత్త రికార్డు నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోని జాక్రాన్‌పల్లిలో 228.9 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఎగువున కురిసిన వర్షాలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లు నిండుకున్నాయి. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో మూసి పొంగి పొర్లుతోంది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాలిపేరు 9 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 32.1 అడుగులకు చేరుకుంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో నీట మునిగిన సీతమ్మ విగ్రహం నీట మునిగింది.
రెండురోజులు తేలికపాటి వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇలావుండగా సోమవారం నాటి వాయుగుండం పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి మంగళవారం విదర్భ పరిసర ప్రాంతాల్లో నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం నాటికి మరింత బలహీనపడనుంది.
ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలి: స్పెషల్ సీఎస్
రాష్ట్రంలో వరద పరిస్థితులను ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ మంగళవా రం ఇంజనీర్లతో సమీక్షించారు. క్షేత్రస్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వైద్య సిబ్బంది సెలవులు రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపా రు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సెలవు మంజూరు చేయకూడదని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల జ్వర సర్వే చేపట్టాలన్నారు. నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది తమ పరిధిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు.
హెచ్‌ఎండీఏలో ప్రత్యేక బృందాలు
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలో ఉన్న 185 చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం 15 మంది ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. అలాగే వరద పరిస్థితులపై ఫిర్యాదులకు జలసౌధ కంట్రోల్ రూమ్‌లో 040–23390794 నంబర్ ఏర్పాటు చేసింది.
అంత్యక్రియల్లో పాల్గొని, స్నానానికి వెళ్లి..
హనుమకొండ జిల్లా నడికూడ మండలం నార్లాపూర్ గ్రామంలో వాగులో పడి గ్రామానికి చెందిన ఈర్ల అభినవ్ (22), ఈర్ల కౌశిక్ (22) మంగళవారం గల్లంతయ్యారు. అదే గ్రామానికి చెందిన కొమురయ్య సోమవారం రాత్రి చనిపోగా.. మంగళవారం అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం వాగులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
కోతకు గురైన అప్పా చెరువు కట్ట
భారీ వర్షాలకు హైదరాబాద్ నగర శివారులోని ‘అప్పా’చెరువు కట్ట రెండు ప్రాంతాల్లో కోతకు గురైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు బెంగళూరు జాతీయ రహదారిపై వరద నీరు చేరింది.
నిజామాబాద్ జిల్లా ముత్తకుంట గ్రామ శివారులో లోలెవల్ వంతెనపై ప్రవహిస్తున్న చెరువు అలుగు నీటి వరదలో లారీ చిక్కుకు పోగా అందులోని ఏడుగురు కూలీలను గ్రామస్తులు తాడు సహాయంతో రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment