రోడ్డు ప్రాజెక్టులకు అటవీ అనుమతుల్లో జాప్యం తగదు
మంత్రులు కోమటిరెడ్డి, కొండా సురేఖ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు అటవీ అనుమతులివ్వడంలో నిర్లక్ష్యానికి తావు లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయా ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతుల సాధనలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని అన్నారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, అటవీ శాఖల అధికారులతో ఇద్దరు మంత్రులు నిర్వహించిన సమీక్షలో పలు రహదారుల పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా 7 రోడ్డు ప్రాజెక్టుల పనులు, నాలుగేళ్లుగా ఒక ప్రాజెక్టు, మూడేళ్లుగా 20 ప్రాజెక్టులు, ఏడాది కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
గత ఐదేళ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే రెండు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి అనేక రహదారులకు అనుమతులు సాధించినా ఒక్కడ అనుమతులు లేక కొత్త రోడ్ల మంజూరీ గురించి కేంద్రాన్ని అడగడం ఇబ్బందిగా మారిందన్నారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ఈ సందర్భంగా అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్‌లను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
డీఎఫ్‌ఓల స్థాయిలో 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ఆమె ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీనిచ్చారు. కాగా, అటవీ అనుమతుల సాధన పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఎస్‌ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
రీజనల్ ఆఫీసర్ తీరు సరికాదు..
రాష్ట్ర రోడ్డు ప్రాజెక్టుల అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ రీజనల్ ఆఫీసర్ త్రినాథరావు చిన్న చిన్న అంశాలపై వివరణలతో కాలయాపన చేయడంపై ఇద్దరు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అండగా నిలబడాల్సిందిపోయి.. సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment