మూడో రోజు ముగిసిన విచారణ
► లిక్కర్ స్కాంలో భాగంగా కల్వకుంట్ల కవితపై ఈడీ నిర్వహించిన మూడోరోజు విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 9:40 గంటల వరకు కొనసాగింది.
► లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11.30 నుంచి ఆమెను ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ తరుణంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కేంద్ర బలగాలు వెనుదిరిగాయి. మరోవైపు ఈడీ ఆఫీస్ వద్దకు కవిత ఎస్కార్ట్ వాహనం చేరుకుంది. ఇక.. అరగంట నుంచి కవిత లీగల్ టీంలోని అడ్వొకేట్ సోమాభరత్ కుమార్, ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నారు.
► ఎనిమిది గంటలుగా కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఢిల్లీ ఈడీ ఆఫీస్‌లోని మూడో ఫ్లోర్‌లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. కాసేపటి కిందట కవిత లీగల్ టీం ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈడీ పిలుపు మేరకు లీగల్ టీం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. సోమాభరత్ కుమార్‌తో పాటు బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈడీ అడిగిన పత్రాలను వాళ్లు సమర్పించినట్లు తెలుస్తోంది.
► వరుసగా రెండోరోజూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఐదు గంటలకు పైగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించగా.. పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.
► ఈడీ కార్యాలయంలో మూడో రోజు(వరుసగా రెండో రోజు) విచారణకు హాజరయ్యారు కవిత. అంతకుముందు ఆమె అధికారులకు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే తనను విచారిస్తున్నారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు ధ్వంసం చేశానని చెబుతున్నారని, అందుకే తన పాత ఫోన్లన్నీ ఈడీకి ఇచ్చేస్తున్నట్లు చెప్పారు.
ఫోన్ల విషయంలో తనకు కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. కానీ నవంబర్ నుంచే తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు.
► ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కవిత ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి నుంచి బయల్దేరారు. కారు ఎక్కేముందు మీడియాకు తన ఫోన్లను చూపించారు. కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారని, వాటి వివరాలు చెప్పడం లేదని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో ఆమె ఇలా చేయడం గమనార్హం. వీటిని ఆమె ఈడీ అధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
► ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మొత్తంగా మూడో రోజు విచారణకు హాజరుకానున్నారు. ఈడీ కార్యాలయానికి వెెళ్లే ముందు ఆమె ఢిల్లీలో న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత 10 ఫోన్లు వాడి, వాటిని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో ఆమె ఫోన్లను మీడియాకు చూపించే అవకాశం ఉంది.
కాగా.. కవితను ఈనెల 11న 9 గంటల పాటు, 20న 11 గంటల పాటు ఈడీ విచారించింది. ఇవాళ కూడా గంటలపాటు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉంది. అరెస్టు చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం.
► ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు మంగళవారం ఉదయం మళ్లీ విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు, రెండోసారి సోమవారం సుదీర్ఘంగా 11 గంటల పాటు ప్రశ్నించారు.
11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా సౌత్ గ్రూపు లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది.
కవిత ఒక్కరినే..!
ఉదయం కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లైతో కలిపి, ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ కమ్యూనికేషన్ల ఇన్‌చార్జి విజయ్ నాయర్‌లతో కలిపి విచారించారనే వార్తలు వచ్చినప్పటికీ.. కవిత ఒక్కరినే ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ పిళ్లైనుంచి పదిసార్లకు పైగా వాంగ్మూలాలు సేకరించిన ఈడీ.. ఆయా వాంగ్మూలాల్లో కవిత ప్రస్తావన ఉన్న అంశాలపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.
మద్యం వ్యాపారంలో పిళ్‌లై వాటా 32.5 శాతానికి గానూ ఎంత పెట్టుబడి పెట్టారు? కిక్ బ్యాక్‌ల రూపంలో వెనక్కి ఏ మేరకు వచ్చింది? పిళ్లైతో కలిసి ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారం విస్తరించాలనుకోవడం? తదితర ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్, నాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో ఏయే అంశాలు చర్చించారని కూడా అడిగినట్లు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్ల నుంచి తెప్పించిన పలు రికార్డులు ముందుపెట్టి, ఆయా సమావేశాల్లో ఏమేం మాట్లాడారని ప్రశ్నించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment