మూడు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా
కూకట్‌పల్లి నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లోని 16 షెడ్లు
మరో రెండు చోట్ల సర్కారు భూమిలోని విల్లాలు..
వివరాలు వెల్లడించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
సామాన్యుల నివాసాల జోలికి వెళ్లలేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాల నేపథ్యంలో కొంత విరామం తర్వాత హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన పని పునః ప్రారంభించింది. ఆదివారం మూడు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు నల్లచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లతో పాటు రెండు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిరక్షించారు.
ఆయా ప్రాంతాల్లో ఉన్న 44 నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా 8 ఎకరాలను కబ్జా చెర నుంచి విడిపించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. అయితే ఈ మూడు ప్రాంతాల్లోనూ కొన్నింటిలో సామాన్యులు నివసిస్తున్నారని, ఆ నిర్మాణాలను కూల్చివేయకుండా నోటీసులు మాత్రమే జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నం.66, 67, 68, 69లలో విస్తరించి ఉన్న నల్లచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి.
మొత్తం 27 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో నాలుగు ఎకరాల విస్తీర్ణాన్ని ఆక్రమించిన కొందరు.. 16 షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించారు. షెడ్లలో వంట శాలలు ఏర్పాటు చేసి క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నారు. వాటిలో పనిచేసే వారు కూడా ఆ షెడ్లలోనే నివాసం ఉంటున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు ఆదివారం సంబంధిత అధికారులతో కలసి ఆ షెడ్లను కూల్చేశారు.
అమీన్‌పూర్ మండలంలో..
అలాగే అమీన్‌పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ సర్వే నం.164లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఎకరం కబ్జా చేసిన కొందరు జీ+5 విధానంలో భవనాలు నిర్మించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో విచారణ చేసిన అధికారులు, ఈ తరహాకు చెందిన మూడు నిర్మాణాలను కూల్చేసి స్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అమీన్‌పూర్ మండలంలోని పటేల్‌గూడలో సర్వే నం.12/2, 12/3లలో సర్కారు భూమి కబ్జాకు గురైంది.
మూడు ఎకరాల స్థలంలో కొందరు 25 నిర్మాణాలు చేపట్టారు. వీటిలో గ్రౌండ్ ఫ్లోర్‌తో నిర్మించిన విల్లాలతో పాటు బహుళ అంతస్తులతో నిర్మించినవి ఉన్నాయి. ఈ 25 నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు.. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అ«ధికారులతో కలసి ఈ కూల్చివేతలు చేపట్టినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, జలవనరుల పరిరక్షణ కోసం హైడ్రా ఆపరేషన్లు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
కూకట్‌పల్లిలోని నల్లచెరువులో కూల్చేసిన షెడ్లు అన్నీ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిచిన అక్రమ నిర్మాణాలు అని, వాటిని వాణిజ్య అవసరాల కోసం వాడుతున్నారని ఆయన తెలిపారు. అలాగే అమీన్‌పూర్ ప్రాంతంలో కూల్చేసిన మూడు బహుళ అంతస్తుల భవనాలు ప్రభుత్వ స్థలంలో ఉన్నాయన్నారు. అయితే పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్వే నంబర్‌తో అనుమతులు తీసుకున్నట్లు వివరించారు.
తాము కూల్చేసిన దాదాపు 27 విల్లాలు బిల్డర్‌తో పాటు ఇద్దరు ఇతరులకు చెందినవని, రెండింటిలో మాత్రమే కుటుంబాలు నివసిస్తున్నాయని, ఆ రెండింటికీ నోటీసులు ఇచ్చి వదిలేశామని వివరించారు. అలాగే కూకట్‌పల్లిలోని నల్లచెరువులోనూ కొన్ని కుటుంబాలు నివసిస్తున్న నిర్మాణాల జోలికి వెళ్లలేదని రంగనాథ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment