నర్సాపూర్: ‘ఏందిరా ఈ పంచాయితి’ సినిమాలో హిట్ కొట్టిన ‘తలిచె తలిచె కొద్దీ గుర్తొస్తున్నా–కురిసే కురిసే వెన్నెల నువ్వె నాన్న’ పాట రాసిన యువకవి మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి. నర్సాపూర్‌కు చెందిన రమావత్ శ్రీకృష్ణ పేదరికంలో పెరిగి ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తూ డిగ్రీ పట్టా పుచ్చుకొని కంప్యూటర్ కోర్సులు చదివినా అనంతరం కుటుంబ పోషణ చేపడుతూనే తనలో ఉన్న పాటలు, కథలు రాయాలన్న కవిత్వానికి జీవం పోశాడు.. ఇంకా పోస్తూనే ఉన్నాడు.
స్వతహాగా పాటలు రాయాలన్న తపన..
పాటలు, కథలు రాయాలన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వెళ్లిన శ్రీకృష్ణ ఇప్పటి వరకు తెలుగులో 20 పాటలు, హిందీలో 10 పాటల వరకు రాశాడు. సుమారు రెండేళ్ల కిందట ‘సినిమా సోకులు’ పేరిట ఓ పాటతో ప్రైవేటు ఆల్బం తయారు చేశాడు. ఈ ఆల్బంలో శ్రీకృష్ణ రాసిన అరరే మామ పట్నం పోదామా పాటను సింగర్ పెద్దపల్లి రోహిత్ పాడారు. నర్సాపూర్ రత్నాలు, మిర్జాపూర్ ఫాంహౌజ్ తదితర పలు షార్ట్ ఫిలిమ్స్ చేసినా ఆర్థిక ఇబ్బందులతో వాటిని ప్రమోట్ చేయలేకపోతున్నాడు. కంప్యూటర్ కోర్సులు చదివే సమయంలో ఎడిటింగ్, డీఓపీ సైతం నేర్చుకోవడంతో పలు సోషల్ మీడియాకు వీడియోలు తయారు చేయడం, ఇతరత్రా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇండస్ట్రీలో అతన్ని శ్రీకృష్ణ గ్రిల్లర్‌గా పిలుస్తారు.
కుటుంబ నేపథ్యం
నర్సాపూర్ మండలంలోని తుల్జారాంపేట తండాకు చెందిన రమావత్ మంగు, జీరిభాయి దంపతులు సుమారు 40 ఏళ్ల కిందట నర్సాపూర్‌కు వచ్చి పట్టణంలోని జగన్నాథరావు కాలనీలో స్థిర పడ్డారు. వారి సంతానం రమావత్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. దీంతో కుటుంబం గడవడక పదవ తరగతి ఫెయిల్ కాగానే పట్టణంలోని పలు దుకాణాల్లో పని చేస్తూ కుటుంబపోషణలో తల్లికి అండగా నిలిచాడు. ఓపెన్ యూనివర్శిటీలో చేరి డిగ్రీ పూర్తి చేయడంతోపాటు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేశాడు. తల్లి జీరిభాయి, భార్య మనస్విని, ఇద్దరు కూతుర్లు హయాతి, హైందవిశ్రీలతో కలిసి నర్సాపూర్‌లో నివాస ముంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment