పాతబస్తీలో కనుమరుగవుతున్న బంగారం వ్యాపారం
రాను రాను తగ్గుతున్న వైనం..
కోట్ల రూపాయల పెట్టుబడి.. అయినా పరేషాన్
పాతబస్తీ వీడుతున్న బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం
చార్మినార్: నగరంలో 400 ఏళ్ల కిందట బంగారం వ్యాపారం అంటేనే పాతబస్తీ. నిజాం కాలం నుంచి పాతబస్తీలో కొనసాగుతున్న బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు ప్రస్తుతం కష్టకాలమొచి్చంది. ఇక్కడి వ్యాపారాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అసలే బాటిల్ నెక్ రోడ్లు.. దీనికి తోడు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీలో బంగారం వ్యాపారం తగ్గింది.
చిన్న వ్యాపారులు రూ.50 లక్షల నుంచి.. పెద్ద పెద్ద షోరూం వ్యాపారులు రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను కొనసాగించాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తున్న ఇక్కడి వ్యాపారులకు మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో పాతబస్తీలోని దుకాణదారులు తమ వ్యాపారాలను నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రధాన సమస్య పార్కింగే..
పాతబస్తీలో ద్విచక్ర వాహనాల పార్కింగ్‌తో పాటు కార్లు, భారీ వాహనాలకు పార్కింగ్ సమస్య, నిత్యం ట్రాఫిక్ రద్దీ పాతబస్తీలో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. వీటిని ఎక్కడ పార్క్ చేయాలో తెలియక వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇక్కడి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రానురాను తమ వ్యాపారాలు కుంటు పడుతున్నాయంటున్నారు. పార్కింగ్ అందుబాటులో లేకపోవడమే కాకుండా నిత్యం వాహనాల రద్దీతో పాటు రోడ్లపై నెమ్మదిగా కదిలే వాహనాలు పాతబస్తీలోని బంగారు, వెండి, ముత్యాల వ్యాపారాలకు అడ్డుగా మారాయి.
నిజాం కాలం నుంచి..
ఒకప్పుడు చార్మినార్ పరిసరాల్లో బంగారం, వెండి, ముత్యాల వ్యాపారం చేసుకోవడానికి నిజాం సర్కార్‌లో అప్పటి నిజాం స్వయంగా కొంత మందిని ఉత్తర భారతదేశం నుంచి రప్పించినట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. నిజాం కాలం నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్, కాలికమాన్, చార్‌కమాన్, ఘన్సీబజార్, శాలిబండ, సిద్ధి అంబర్ బజార్ తదితర ప్రాంతాల్లో దాదాపు 300 వరకు దుకాణాలుండేవి.
ప్రస్తుతం 50 నుంచి 100 దుకాణాలకు తగ్గిపోయాయి. వీరంతా నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ తమ వ్యాపారాలను విస్తరించుకుంటున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసి ఇవ్వడానికి పనిచేసే వలస కార్మికులు సరైన ఆర్డర్లు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
పాతబస్తీలో వ్యాపారాభివృద్ధికి చర్యలు చేపట్టాలి
మదీనా నుంచి చార్‌కమాన్–చార్మినార్ వరకు వ్యాపారాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దుకాణాల ముందు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతో అటు వ్యాపారులతో పాటు ఇటు వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో పాటు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాతబస్తీ వ్యాపారులు తమ వ్యాపారాన్ని నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. – నాగ్‌నాథ్ మాశెట్టి, గుల్జార్‌హౌస్/బషీర్‌బాగ్
Comments
Please login to add a commentAdd a comment