సాక్షి, హైదరాబాద్: విదేశీ బొగ్గు దిగుమతులకు సంబంధించి కేంద్రం రోజుకో కొత్త ఉత్తర్వుతో రాష్ట్రాలను కలవర పెడుతోంది. బొగ్గు దిగుమతులకు అవసరమైన నిధుల లభ్యతకు వీలుగా విద్యుదుత్పత్తి కంపెనీలకు ఇకపై ప్రతి వారం కనీసం 15 శాతం బిల్లులను చెల్లించాలని దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను కేంద్ర విద్యుత్ శాఖ గురువారం ఆదేశించింది. విద్యుదుత్పత్తి కంపెనీలు బిల్లు జారీ చేసిన తేదీ నుంచి వారంలోగా తప్పనిసరిగా కనీసం 15 శాతం చెల్లింపులు చేయాలని, మిగిలిన 85 శాతం చెల్లింపులను విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లోని నిబంధనల ప్రకారం జరపాలని సూచించింది. వారంలోగా 15 శాతం బిల్లులు చెల్లించడంలో విఫలమైతే, విద్యుదుత్పత్తి కంపెనీలు ఒప్పందం ప్రకారం డిస్కంలకు అమ్మాల్సిన విద్యుత్‌లో 15 శాతాన్ని పవర్ ఎక్సే్చంజీల్లో అమ్ము కోవడానికి వీలు కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర విద్యుత్ శాఖ స్పష్టం చేసింది.
15% విద్యుత్ కోల్పోయే ప్రమాదం!
ఈ నిబంధనల ప్రభావం రాష్ట్ర డిస్కంలపై పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ఎన్టీపీసీ, ఇతర కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి నుంచి 3,111 మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్లు, ప్రైవేటు సెమ్‌కార్ప్ సంస్థ నుంచి 840 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌ను రాష్ట్ర డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. 45 రోజుల్లోగా బిల్లులు చెల్లించడానికి ఒప్పందాల్లో నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే ఈ గడువులోగా చెల్లింపులు చేయకలేక ఇప్పటికే రూ.వందల కోట్ల అపరాధ రుసుముతో బకాయిలను చెల్లించే పరిస్థితిని డిస్కంలు ఎదుర్కొంటున్నాయి.
తాజాగా కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాలు డిస్కంలకు మరింత ఇబ్బందికరంగా మారవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతివారం 15 శాతం బిల్లులను చెల్లించని పక్షంలో ఒప్పందం ప్రకారం రావాల్సిన విద్యుత్‌లో 15 శాతాన్ని రాష్ట్రం కోల్పోయే ప్రమాదం ఉంది. 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గు వాడకంతో పెరగనున్న విద్యుదుత్పత్తి వ్యయాన్ని సైతం డిస్కంల నుంచి జనరేటర్లు వసూలు చేసుకోవాలని సూచించిన కేంద్ర విద్యుత్ శాఖ, ఈ అదనపు వ్యయాన్ని లెక్కించడానికి కొత్త ఫార్ములాను సైతం ప్రకటించడం గమనార్హం.
‘దిగుమతి బొగ్గు ప్రభావం’ ఉండదనుకుంటే కొత్త బెడద
దేశంలో బొగ్గు కొరత తీవ్రమైన నేపథ్యంలో దేశంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 90 శాతం దేశీయ బొగ్గులో 10 శాతం దిగుమతి చేసుకున్న బొగ్గును తప్పనిసరిగా కలిపి (బ్లెండ్ చేయడం అంటారు) విద్యుదుత్పత్తి జరపాలని గతంలో కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అవసరమైన విదేశీ బొగ్గు కొనుగోళ్లకు ఈ నెల 31లోగా ఆర్డర్లు జారీ చేయాలని, వచ్చే నెల 15లోగా దిగుమతులు ప్లాంట్ల వద్దకు చేరుకోవాలని మరో ఉత్తర్వులో గడువులు విధించింది. గడువులోగా ఆర్డర్లు ఇవ్వని పక్షంలో ఆ తర్వాత 15 శాతం బొగ్గును దిగుమతి చేయాల్సి ఉంటుందని అల్టిమేటం జారీచేసింది. అయితే రాష్ట్రంలో సింగరేణి బొగ్గు గనులున్న నేపథ్యంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదని, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో బొగ్గు దిగుమతులకు సంబంధించిన ఆదేశాల ప్రభావం జెన్‌కో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉండదని ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ తాజాగా ప్రతి వారం 15 శాతం బిల్లులను జెనరేటర్లకు చెల్లించాలని, లేనిపక్షంలో 15 శాతం విద్యుత్ కట్ చేస్తామని కేంద్రం చెప్పడంతో కొత్త బెడద వచ్చి పడినట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment