సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-కారు రేస్ కేసుకు సంబంధించి కేటీఆర్(KTR)కు తాజాగా ఈడీ(enforcement Directorate) అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జనవరి ఏడో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ.. కేటీఆర్ సహా అరవింద్ కుమార్‌కు సైతం నోటీసులు ఇచ్చింది.
వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి తాజాగా కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా వచ్చే నెల ఏడో తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే సమయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసును ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. FEOకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేస్ (Formula E-Car Race) కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఈ నెల 21న కేటీఆర్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30 వరకు ఆరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కేసులో ‘కేటీఆర్ నాట్ టు అరెస్ట్’ను ఎత్తివేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయకూడదని పోలీసులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment