ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలు, నకిలీ బ్యాంకు లేఖలతో బ్యాంకులో బం గారాన్ని కుదవపెట్టి రూ.90 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ మేనేజింగ్ పార్టనర్ సంజయ్ అగర్వాల్ ఆస్తులపై ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాంపల్లి సెషన్స్ కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002 కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదు కూడా చేసింది. ఎస్‌బీఐలో ఉన్న 250 కిలోల బంగారాన్ని విడిపించేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తప్పుడు బ్యాంకు గ్యారంటీ పత్రాలను బెంగళూరుకు చెందిన ఘన్‌శ్యాందాస్ జెమ్స్ అండ్ జువెల్స్ భాగస్వాములు సమర్పించారు. దీనిపై సీబీఐ 2011 అక్టోబర్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
సొమ్మును దారి మళ్లించి..
తమ మోసం వెలుగు చూడటంతో సంజయ్, అతని సోదరులు అజయ్‌కుమార్, వినయ్‌కుమార్.. అబిడ్స్‌లోని తమ దుకాణంలో ఉన్న బంగారు నిల్వలను స్థానిక మార్కెట్‌లో విక్రయించి నగదు రూపంలో సొమ్ము చేసుకున్నారు. ఈ నగదుతో 2012లో సంజయ్ తన భార్య పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు తన సోదరులు, ఓ ఉద్యోగి పేరుపైనా మరో 3 సంస్థలను తెరిచారు. కుటుంబీకుల పేరు మీద అనేక ఖాతాలను తెరిచి లెక్కచూపని నగదుతో లావాదేవీలు నిర్వహించడంతో పాటు శ్రీకాంత్ గుప్తా అనే నకిలీ పేరుతో పాస్‌పోర్టును పొంది అనేకసార్లు విదేశాల్లో పర్యటించాడు.
అక్కడా బ్యాంకు ఖాతాలు తెరిచి అక్రమ సొమ్మును దారి మళ్లించి తన వద్ద పనిచేసే ఉద్యోగి అవినాశ్ సోని పేరిట బినామీ ఆస్తులను కూడబెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న సంజయ్‌ను అరెస్టు చేసిన ఈడీ అతనితో పాటు అతని కుటుంబీకులకు సంబంధించిన రూ.9.5 కోట్ల విలువ చేసే 9 స్థిరాస్థులను అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. తెల్లాపూర్, శంషాబాద్‌లోని వ్యవసాయ భూమి, రాయదుర్గంలో ప్లాటు, కొంపల్లిలో విల్లా, జూబ్లిహిల్స్‌లో వేయి చదరపు గజాల భూమి ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment