
ధన్వాడ (నారాయణపేట): పింఛన్ తీసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు క్యూ లైనులో కుప్పకూలి మృతి చెందింది. ఈ సంఘటన నారాయణ పేట జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధన్వాడ మండల కేంద్రానికి చెందిన మిద్దెలి నర్స మ్మ (80) కొంత కాలంగా హైదరాబాద్ లో తన కొడుకు వద్ద ఉంటుంది. మంగళవారం పింఛన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న ఆమె అకస్మాతుగా కళ్లు తిరిగి కిందపడి పోయింది. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో నారాయణపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అయితే పింఛన్ తీసుకోవడానికి చివరిరోజు అని చెప్పడంతో చాలామంది పింఛన్‌దారులు తరలివచ్చారు. పోస్టాఫీసుకు పింఛన్ డబ్బులు ఆలస్యంగా రావడం, త్వరగా ముగించడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment