భూదాన్ పోచంపల్లి: పేటెంట్ హక్కు కలిగి ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్‌ను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి విక్రయిస్తున్న పలు వస్త్ర దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నెల 8న సాక్షి దినపత్రికలో ‘ఇక్కత్‌కు ఇక్కట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 12 చేనేత వస్త్రాల షోరూంలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అక్కడి షాపుల్లో విక్రయిస్తున్న ఇక్కత్ ప్రింటెడ్, పవర్‌లూమ్‌లపై తయారైన వస్త్రాలను సీజ్ చేసి సంబంధిత షాపు యజమానులకు నోటీసులు జారీచేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఎం.వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ.. దినపత్రికలలో వచ్చిన కథనానికి స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పోచంపల్లిలో సీజ్ చేసిన వస్త్రాలను చెన్త్నెలోని ల్యాబ్‌టెస్టింగ్‌కు పంపిస్తామని, ప్రింటెడ్ వస్త్రాలు అని తేలితే నిందితులు స్థానికులైతే కేసు నమోదు చేస్తామని, లేదా ఇతర రాష్ట్రాలలో తయారైనవిగా తేలితే అక్కడి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు నివేదిస్తామని వెల్లడించారు.
హ్యాండ్లూమ్ మార్కు తప్పనిసరి
స్వచ్ఛతకు నిదర్శనమైన హ్యాండ్లూమ్ మార్కు, సిల్క్‌మార్క్‌తో పాటు ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ లోగో ట్యాగ్ చేసిన చేనేత వస్త్రాలను మాత్రమే పోచంపల్లి వస్త్ర వ్యాపారులు అమ్మాలని వెంకటేశం కోరారు. దాడుల్లో జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ విద్యాసాగర్, డీఓలు ప్రసాద్, సంధ్యారాణి, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment