
ఫైల్ ఫోటో
సాక్షి, హన్మకొండ: ఈ ఏడాది అధిక ఆశ్వయుజం వచ్చినందున ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. దీన్ని తెరదించడానికి తెలంగాణ రాష్ట్ర వైదిక పురోహిత సంఘం బాధ్యులు మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ‘కుడా’ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. పండుగల నిర్వహణపై చర్చించి ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ పలు తీర్మానాలు చేశారు. ఈ నెల 17వ తేదీ గురువారం భాద్రపద బహుళ అమావాస్య (పితృ అమావాస్య) రోజున ఎప్పటిలాగే పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతో పాటు అదేరోజు ఆనవాయితీ ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. నెల రోజుల తర్వాత అక్టోబర్ 17వ తేదీ శనివారం నిజ ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి తిథి మొదలు 8 రోజుల పాటు బతుకమ్మ ఆడుకొని అదే నెల 24వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) రోజున సద్దుల బతుకమ్మ జరుపుకోవాలన్నారు.
గతంలో 1963, 1982, 2001ల్లో కూడా ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మధ్య నెల రోజుల వ్యవధి వచ్చిందని ఈ సందర్భంగా పండితులు గుర్తు చేశారు. ఈ సమావేశంలో పురోహిత సంఘం రాష్ట్ర కన్వీనర్ తాండ్ర నాగేంద్రశర్మ, పండితులు ఎల్లంభట్ల సీతారామశాస్త్రి, తాండ్ర పిచ్చయ్యశాస్త్రి, వెలిదె యుగేందర్‌శర్మ, డాక్టర్ ప్రసాద్‌శర్మ, మరిగంటి శ్రీకాంతాచార్య, డింగరి వాసుదేవాచార్యులు, గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, గంగు సత్యనారాయణశర్మ, డాక్టర్ శేషభట్టార్ వెంకటరమణాచార్యులు, మెట్టెపల్లి హరిశర్మ, పీతాంబరి శ్రీకాంతాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment