Enquiry Committee Submitted Report Devaryamjal Temple Lands Issue - Sakshi
Sakshi News home page

స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!

Published Wed, Nov 16 2022 1:50 AM | Last Updated on Wed, Nov 16 2022 11:13 AM

Enquiry Committee Submitted Report Devaryamjal Temple Lands Issue - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌ రామచంద్రస్వామి ఆలయ భూములు దేవాదాయ శాఖవేనని విచారణ కమిటీ నిగ్గుతేల్చింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బర్తరఫ్‌తో వెలుగుచూసిన ఈ భూముల వ్యవహారంపై నిగ్గు తేల్చాలని నిర్ణయించిన సర్కారు.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.రఘునందన్‌రావు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.

ఈ త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆలయ భూముల్లో వాణిజ్య నిర్మాణాలు, ఫంక్షన్‌ హాళ్లు, రిసార్టులు, పరిశ్రమలు పుట్టుకొచ్చినట్లు గుర్తించింది. అలాగే, కొంతమంది సాగు కూడా చేసుకుంటున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆలయానికి సంబంధించి 1,350 ఎకరాలు దేవాదాయశాఖకే చెందుతాయని కమిటీ తేల్చింది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఈ భూముల్లో తిష్టవేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

సీతారామస్వామి... సీతారామరెడ్డి అయ్యాడు!  
దేవరయాంజాల్లోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనది. నిజాం హయాంలో ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని వితరణ చేశారు. దానిని ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూరికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిటే ఉంది.

ఈ భూములన్నీ 55 నుంచి 63, 639–641, 656, 657, 660–682, 686–718, 736 సర్వే నంబర్లలో ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ తర్వాత ఆ భూమి కబ్జాల పాలైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామరెడ్డి, సీతారామారావు, సీతారామయ్య, సీతారాములుగా.. మారిపోయి కబ్జాదారుల పేర్లు రికార్డులకెక్కాయి. ఆ భూముల్లో రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. 

రికార్డులు స్పష్టంగా ఉన్నా... 
ఆ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్‌ ఉంది. మరో 800 ఎకరాల భూమి వ్యవసాయం పేరుతో ఖాళీగా ఉంది. మరి వాటి రూపంలో రావాల్సిన ఆదాయం ఎటుపోతోంది? ఎవరి జేబుల్లోకి వెళుతోంది? అసలా భూములన్నీ దేవుడి మాన్యమేనని పాత రెవెన్యూ రికార్డులు స్పష్టంగా చెబుతున్నా ఇన్ని నిర్మాణాలు ఎలా వెలిశాయి? వీటన్నింటికీ జవాబు ఒకటే... పలువురు నేతలు, అధికారులు కుమ్మక్కై దేవుడి సొమ్మును దోచుకుంటున్నారు. ఈ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారు ప్రతినెలా రూ.5 కోట్ల మేర అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.  

అక్రమార్కులకు క్లీన్‌చిట్‌.. పదోన్నతులు 
ఈ భూములను ’కబ్జా’లో ఉన్నవారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కింద దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. కానీ, దీనిపై నియమించిన జస్టిస్‌ వెంకటరామిరెడ్డి కమిషన్‌ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి.. ఆలయ మేనేజర్‌ చంద్రమోహన్, సహాయ కమిషనర్‌ రాఘవాచార్యులు, మాజీ డిప్యూటీ కమిషనర్‌ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని నివే దికలో పేర్కొంది.

విజిలెన్స్, ఏసీబీ కూడా వీరితోపాటు నాటి దేవాదాయ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ముఖ్యకార్యదర్శి జేపీ మూర్తి, సంయుక్త కమిషనర్‌ రామకృష్ణకుమార్, ఉపకమిషనర్‌ మోహనాచారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేశాయి. కానీ, అప్పటి ప్రభుత్వం  వారికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆపై పదోన్నతులు కూడా కల్పించిందన్న ఆరోపణలున్నాయి. కాగా, హైదరాబాద్‌ శివారులోని ఈ 1,350 ఎక రాలు దేవాదాయ శాఖవేనని కమిటీ తేల్చ డంతో కబ్జాదారుల్లో గుబులు మొదలైంది. మాజీమంత్రి ఈటల రాజేందర్‌సహా వారి బంధువుల  భూములు ఉన్నాయన్న నేపధ్యంలో కక్ష సాధింపునకే ప్రభుత్వం విచారణ చేపట్టిందని పలువురు విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement