Establishment of Microsoft Data Center in Hyderabad: మెగా సిటీకి ఐటీ మకుటం - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు

Published Sat, Jan 22 2022 1:18 AM | Last Updated on Sat, Jan 22 2022 2:44 PM

Establishment of Microsoft Data Center in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ రంగానికి మరింత ఊపు రానుంది. డేటా సెంటర్ల రంగంలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ముందుకు వచ్చింది. శంషాబాద్‌ ప్రాంతంలో 50 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి ఫిబ్రవరిలో అధికారికంగా సంయుక్త ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ద్వారా తొలి విడతలో సుమారు 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని సమాచారం. అయితే డేటా సెంటర్‌ సామర్ధ్యం, విస్తీర్ణం తదితర పూర్తి వివరాలను వచ్చే నెలలోనే మైక్రోసాఫ్ట్‌ ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న హైదరాబాద్‌ క్రమంగా ఆధునిక సాంకేతిక పెట్టుబడులకు కూడా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే క్లౌడ్‌ కంప్యూటింగ్, స్పేస్‌ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌చెయిన్‌ వంటి ఆధునిక ఐటీ సాంకేతికతలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న సంగతి తెలిసిందే. 

9.5 శాతం వాటా సాధన లక్ష్యం
ప్రస్తుతం భారత్‌లో 57.8 కోట్ల మొబైల్‌ ఫోన్ల వినియోగదారులు ఉండగా, మొబైల్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ డేటా వినియోగంలో 20 శాతం వార్షిక వృద్ధిరేటు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో డేటా సెంటర్ల రంగం మార్కెట్‌ ఈ ఏడాది చివరి నాటికి సుమారు లక్షా 11 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. డేటా సెంటర్ల రంగంలో ఇప్పటికే ఏడు శాతం వాటా కలిగి ఉన్న తెలంగాణ, వచ్చే ఏడాది చివరి నాటి 9.5 శాతం వాటా సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫ్లిప్‌కార్ట్, కంట్రోల్‌ ఎస్, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), ఎస్టీ టెలీమీడియా వంటి సంస్థలు ఇప్పటికే డేటా సెంటర్లను ఏర్పాటు చేశాయి. 

నిర్మాణంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సెంటర్లు
మరోవైపు హైదరాబాద్‌లో రూ.20,761 కోట్లతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) 2020 నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అమెజాన్‌ డేటా సెంటర్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించే అవకాశముంది. మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అన్ని విధాలా అనుకూలంగా హైదరాబాద్‌
రాష్ట్రంలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌ సంస్థ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి వచ్చే నెలలో కీలక ప్రకటన చేస్తాం. ప్రభుత్వ సానుకూల విధానాలు, ప్రోత్సాహకాలు, ఐటీ నిపుణుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత అనుకూలంగా మారాయి.
– జయేశ్‌ రంజన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి

డేటా సెంటర్‌ అంటే..
డేటా సెంటర్లలో సమాచారాన్ని భద్రపరు స్తారు. ఐటీ కార్యకలాపాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలా పాల నిర్వహణలో ఈ సెంటర్ల పాత్ర కీలకం. మొబైల్‌ డేటా వినియోగం పెరుగుతున్న కొద్దీ వినియోగదారుల సమాచారాన్ని భద్ర పరచడంలో ఐటీ రంగంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగు తోంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో విని యోగదారుల సమాచారాన్ని భద్రపరిచేం దుకు భారీ ఎత్తున డేటా సెంటర్ల అవసరం పెరుగుతోంది. దీంతో ఈ సెంటర్ల నిర్మాణానికి ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. భారీ విస్తీర్ణంలో నిర్మించే డేటా సెంటర్ల నిర్మాణం, నిర్వహణ కూడా ప్రస్తుతం ఒక పెట్టుబడి, ఉద్యోగాల కల్పనకు అవకాశమున్న రంగంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement