మాజీమంత్రి హరీశ్‌రావు ట్వీట్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్‌ఎస్పీ)లో నవంబరు ఒకటో తేదీ నుంచి అమలు కానున్న కొత్త లీవ్ మాన్యువల్ దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రధానసంచికలో కథనం ప్రచురితమైంది. దీనిపై హరీశ్‌రావు ‘ఎక్స్’వేదికగా ఘాటుగా స్పందించారు. నెలరోజుపాటు కుటుంబాలకు దూరంగా ఉంచడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. పాత విధానంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి పంపే విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందన్నారు. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్‌ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని, సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానిస్టేబుళ్ల సంక్షేమం గురించి మాట్లాడి, అధికారమొచ్చాక శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌కు యజమాని తాళం వేసే పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరుకుందన్నారు. రోజురోజుకు దిగజారిపోతున్న విద్యారంగంపై సీఎం దృష్టి సారించాలని చెప్పారు.
లీవుల్లో ఎలాంటి షరతుల్లేవు: ఎస్‌కే జైన్, ఏడీజీ (టీఎస్‌ఎస్పీ)
టీఎస్‌ఎస్పీ సిబ్బందికి సెలవుల జారీలో ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించలేదని టీఎస్‌ఎస్పీ ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్ ఒక ప్రకటన విడుదలలో తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘నెలకు ఒకసారే ఇంటికి’అన్న కథనంపై ఆయన స్పందించారు. అందరిలాగే వారికి కూడా సీఎల్స్, ఈఎల్స్ అన్నీ అడిగిన వెంటనే ఎలాంటి ఆంక్షల్లేకుండా ఇస్తున్నామన్నారు.
మిగిలిన డిపార్ట్‌మెంట్లలా ఆదివారం వారాంతపు సెలవు కుదరని నేపథ్యంలో వారికి ఒకేసారి నాలుగురోజులపాటు రికార్డెడ్ పరి్మషన్ (ఆర్పీ) కింద సెలవు అనుమతిస్తున్నామని వివరించారు. ఈ సదుపాయం సివిల్, ఏఆర్, ఇతర ఏ పారా మిలటరీలోనూ లేదని గుర్తు చేశారు. సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment