
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా అటు మార్కెట్‌లలో, ఇటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయి రైతన్న నష్టపోతున్న విషయం తెలిసిందే. అయితే, తక్కువ ఖర్చుతోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ రాప్)లను ఓ పద్ధతి ప్రకారం ధాన్యం బస్తాల చుట్టూ చుట్టడం ద్వారా కేవలం రూ.500 ఖర్చుతో (ష్రింక్ రాప్) 100 క్వింటాళ్ల వరకు ధాన్యానికి రక్షణ లభిస్తుందని ఆయన చెబుతున్నారు. ఇందుకోసం రైతులకు సూచనలు చేస్తూ బుధవారం ఆయన విడుదల చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.
కింద ఒక టార్పాలిన్ వేసి, దానిపై ధాన్యం బస్తాలు ఒరవడి ప్రకారం గుట్టగా ఉంచి, దాన్ని టార్పాలిన్‌తో వచ్చేంతవరకు మూసివేసి, ఆ తర్వాత ష్రింక్ రాప్‌ను బస్తాల గుట్ట పైభాగం వరకు చుట్టి దానిపై ఓ తాపీ బుట్ట, పెద్ద బండరాయి పెట్టడం ద్వారా ధాన్యం బస్తాలు తడవకుండా కాపాడుకోవచ్చని ఈ వీడియోలో చూపించారు. టార్పాలిన్‌లు ఎలాగూ రైతులకు అందుబాటులో ఉంటాయి కనుక ష్రింక్ రాప్ (ప్లాస్టిక్ కవర్) కొనుక్కుంటే చాలని కొండా ఈ సందర్భంగా చెప్పారు. గ్రానైట్ రాళ్లు అందుబాటులో ఉంటే, నేరుగా ధాన్యం బస్తాలను వాటిపై పేర్చి, గుట్టను ప్లాస్టిక్ కవర్‌తో చుట్టేయవచ్చని కూడా ఆయన వీడియోలో సూచించారు.