ఆ పులి జాడేది? | Female Tiger Wandering In Chennur Forest Division | Sakshi
Sakshi News home page

ఆ పులి జాడేది?

Published Mon, Feb 22 2021 1:09 AM | Last Updated on Mon, Feb 22 2021 2:44 AM

Female Tiger Wandering In Chennur Forest Division  - Sakshi

సాక్షి, చెన్నూర్‌: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ అటవీ డివిజన్‌లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో సంచరిస్తున్న కే–4 ఆడ పులి జాడ కానరావడం లే దు. పులుల సంరక్షణ కోసం డివిజన్‌లో పెద్ద ఎత్తు న సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే సంచరించే కే–4 పులి 20 రోజులుగా సీసీ కెమెరాలకు చిక్కకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పులి జాడ కోసం అటవీ అధికారులు ముమ్మర గాలింపు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

నడుముకు ఉచ్చుతో.. 
కే–4 పులి నడుము చుట్టూ ఉచ్చు బిగిసి ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా మొండిగా జీవిస్తోంది. ఇన్నాళ్లు డివిజన్‌లోనే సంచరించే పులి 20 రోజులుగా కనిపించకపోవడంపై అధికారుల్లో ఏమై ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా 15 నుంచి 30 రోజుల్లోపు పులి కెమెరాలకు చిక్కకుంటే అటవీ శాఖ అధికారులు దాని జాడ కోసం దృష్టి పెడుతుంటారు. 

నీటి కోసం.. 
వేసవి ప్రారంభమవుతుండటంతో పులి నీటి కోసం అటవీ మార్గంలో విస్తృతంగా సంచరించే అవకాశముంది. ఎక్కువగా సమీపంలోని వాగుల వద్దకు వెళ్తుంటుంది. చెన్నూర్‌ అటవీ డివిజన్‌లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల పరిధిలో 5 నుంచి 6 వాగులున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఇందులో కూడా పులి జాడ కానరాకపోవడంతో హైరానా పడుతున్నారు.  

నాలుగేళ్ల క్రితం.. 
కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతం నుంచి చెన్నూర్‌ అటవీ ప్రాంతానికి వస్తున్న క్రమంలో కే–4 ఆడపులి 2017లో వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు నడుముకు చుట్టుకుని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ క్రమంలో నడుముకు చుట్టుకున్న ఇనుపవైర్‌ రాపిడీతో గాయమైంది. ఈ గాయంతోనే పులి చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుంటున్నారు.  

పట్టుకునేందుకు రూ.10 లక్షల ఖర్చు.. 
గాయంతో ఉన్న పులిని పట్టుకుని రక్షించాలని అటవీ అధికారులు 2018 నుంచే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా టైగర్‌ ట్రాకర్స్‌నూ రప్పించినా ఫలితం లేకుండా పోయింది. బోన్లు సైతం ఏర్పాటు చేశారు. అమెరికా తరహాలో సెంట్‌ స్ప్రే చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక్క కే–4 పులిని పట్టుకునేందుకు సుమారు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అయినా ఇప్పటికీ కే–4 చిక్కకపోవడం గమనార్హం. ఈ పులి పట్టుబడితే నడుముకు ఉన్న ఇనుప వైరును తొలగిస్తే ఆరోగ్యంగా ఉండేదని పలువురు అధికారులు చెబుతున్నారు.  

ప్రత్యేక బృందాలు.. 
పులుల సంక్షరణ కోసం చెన్నూర్‌ డివిజన్‌ అటవీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డివిజన్‌లో 5 యానిమల్‌ ట్రాకర్స్‌ను నియమించారు. అంతేకాకుండా చెన్నూర్‌ మండలంలోని సంకారం, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతాల్లో మూడు బేస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. క్యాంపునకు ఐదు మంది చొప్పున సిబ్బందిని నియమించారు. వీరితో పాటు అటవీ సిబ్బంది పని చేస్తున్నారు. ఇంతమంది సిబ్బంది పని చేస్తున్నా కే–4 జాడ కనిపించకుండా పోవడం ప్రశ్నార్థకంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement