సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి నెట్‌జీరో ప్రభుత్వ కార్యాలయ భవనం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆధునిక హంగులతో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) కోసం 1,872 గజాలు, ఐదంతస్తుల్లో నిర్మితమవుతున్న ఈ భవనంలో నూటికి నూరు శాతం పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరిస్తున్నారు.
నిరంతరం చల్లదనం ఉండేలా...
భవనం శ్లాబ్‌లో స్టీల్, కాంక్రీట్ మిశ్రమంతోపాటు రేడియంట్ ఫ్లోర్ పైపులు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పైపుల్లో నిరంతరం నీరు ప్రవహిస్తూ భవనం పైకప్పు నుంచి లోనికి వేడి రాకుండా ఇది నియంత్రించనుంది. దీంతో భవనం ఎల్లప్పుడూ చల్లదనంతో ఉండనుంది. ఫలితంగా ఏసీలు, ఫ్యాన్ల వినియోగం గణనీయంగా తగ్గనుంది.
ఎంత ఖర్చు చేస్తే.. అంత ఉత్పత్తి..
భవనంలో ఎంత విద్యుత్‌ను ఖర్చు చేస్తున్నామో.. అంత ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో టీఎస్ రెడ్‌కో భవనాన్ని నిర్మిస్తున్నారు. సాధారణ భవనాల్లో ఏడాదికి ప్రతి చదరపు మీటరు (చ.మీ.)కు 175 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అదే ఎనర్జీ కన్జ ర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) భవనాలల్లో 120 యూనిట్లవుతుంది. అయితే టీఎస్‌రెడ్‌కో నిర్మించనున్న ఈ భవనంలో మాత్రం కేవలం 45 యూనిట్ల విద్యుత్ ఖర్చయ్యేలా రూపొందిస్తున్నారు. ఇందుకోసం భవన నిర్మాణ డిజైన్‌లోనే ఇంధన సమర్థత ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
పైకప్పులో గాలి మర, సౌర విద్యుత్..
భవనం పైకప్పులో సౌర విద్యుత్ ఫలకాలు, గాలి మరను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఈ భవన అవసరాలకు అయ్యే విద్యుత్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. భవనంలో విద్యుత్ వినియోగాన్ని తెలిపే అనలిటికల్ డేటా డిస్‌ప్లే, అగ్నిప్రమాదాల గుర్తింపు అలారం, సమాచార డ్యాష్ బోర్డులు, ఎల్‌ఈడీ డిస్‌ప్లే వంటివి ఉండనున్నాయి.
సాధారణ స్టీల్ నిర్మాణాలతో పోలిస్తే 10 శాతం అదనపు ధృఢత్వాన్ని కలిగి ఉండేలా ఆటోక్లేవ్‌డ్ ఏరోటెడ్ కాంక్రీట్ బ్లాక్స్‌తో నిర్మాణం చేపడుతున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రవేశించేలా భవన డిజైన్‌ను రూపొందించారు. దీంతో భవనం లోపల విద్యుత్ ఉపకరణాల వినియోగం తగ్గనుంది. భవనం తొలి 3 అంతస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) కార్యాలయం, 4, 5 అంతస్తులలో రెడ్‌కో ఆఫీసు ఏర్పాటు కానున్నాయి.
జూన్ నాటికి అందుబాటులోకి..
ఈ భవన డిజైన్లను ఢిల్లీకి చెందిన అశోక్ బీ లాల్ అర్కిటెక్ట్స్ రూపొందించగా.. జైరాహ్ ఇన్‌ఫ్రాటెక్ అనే కంపెనీ నిర్మిస్తోంది. బేస్‌మెంట్, స్టిల్ట్‌తోపాటు ఐదంతస్తుల్లో భవనం ఉంటుంది. ప్రతి అంతస్తు 8 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంటుంది. రూ. 22.76 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ శ్లాబ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment