సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
హైడ్రా పేరిట ప్రభుత్వ హైడ్రామా హైడ్రోజన్ బాంబులా తయారైందని మండిపాటు
రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలని డిమాండ్
తెలంగాణ భవన్‌లో మూసీ బఫర్‌జోన్ ఇళ్ల బాధితులతో బీఆర్‌ఎస్ నేతల భేటీ
బాధితుల గోడు విని హరీశ్, సబిత కంటతడి.. ఉచిత న్యాయ సాయానికి హామీ
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘మూసీ నదిలో గోదా వరి నీళ్లు పారిస్తాం అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి అందులో పేద, మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు, రక్తం పారించే ప్రయత్నం చేస్తున్నాడు. హైడ్రా పేరిట మొదలైన సర్కారు హైడ్రామా.. హైడ్రోజన్ బాంబులా మారి ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. దేశమంతా తిరుగుతూ బుల్డోజర్ ఉపన్యాసాలు ఇస్తున్న కాంగ్రెస్ నాయకులు ముందు రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్‌ను ఆపాలి’అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మూసీ బఫర్ జోన్ పేరిట తమ ఇళ్ల కూల్చివేతకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ పలువురు బాధి తులు శనివారం తెలంగాణ భవన్‌కు తరలివచ్చారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి, విక్రమ్, బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ బృందం బాధితులతో సమావేశమ య్యారు.
వారి గోడు వింటూ హరీశ్, సబిత కంటతడి పె ట్టారు. బీఆర్‌ఎస్ తరఫున ఉచిత న్యాయ సహాయం అంది స్తామని లీగల్ సెల్ సభ్యులు ప్రకటించారు. సమస్యలు ఉంటే తమను 8125535604, 9247817735, 998550 7660, 8143726666 నంబర్లలో సంప్రదించాలని సూ చించారు. అనంతరం హరీశ్ మీడియాతో మాట్లాడారు.
పేదల ఇళ్లను రాత్రికిరాత్రే కూలగొడతారా?
‘రేవంత్ సోదరునికి నోటీసుల పేరిట 45 రోజుల వ్యవధి ఇచ్చిన ప్రభుత్వం.. పేదల ఇళ్లను రాత్రికిరాత్రే బుల్డోజర్లతో కూలగొడుతోంది. బాధితులంతా రెక్కల కష్టంతో భూ ములు కొనుక్కొని అన్ని అనుమతులు, బ్యాంకు లోన్లతో ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వానికి పన్నులూ కట్టారు. 1993లో అనుమతులు ఇచ్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూల్చడం అన్యాయం’అని హరీశ్‌రావు విమర్శించారు.
పది వేల ఇళ్లు కూలుస్తామని తొలుత పేర్కొన్న ప్రభుత్వం.. 25 వేల ఇళ్లు కూల్చేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. బాధితుల వేదన వింటే నాకు బాధగా ఉందని.. పేదల గుండెలు ఆగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితులు ధైర్యం కోల్పోవద్దని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచంలా నిలబడతారని చెప్పారు.
మమ్మల్ని ఆక్రమణదారులు అంటున్నారు
కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. అధికారులు ఇప్పుడు మమ్మల్ని ఆక్రమణదారులని ముద్రవేసి దొంగల్లా చూస్తున్నారు. తలుచుకుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంభయంగా గడుపుతున్నాం. – సిరిమాను
మా లోన్లు ఎవరు కడతారు?
బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు తెచ్చుకొని ఇళ్లు కట్టుకున్నాం. ఉన్నట్లుండి అభివృద్ధి, సుందరీకరణ పేరుతో మా ఇళ్లు కూలిస్తే లోన్లు ఎవరు కడతారు? మేము ఎక్కడ బతకాలి? మా ఇళ్లు అక్రమమైనప్పుడు ప్రభుత్వం మాకు అన్ని వసతులు ఎందుకు కల్పించింది? – తేజస్విని, సన్‌సిటీ కేకే నగర్,నర్మద, గంధంగూడ
ఇప్పుడు కూలుస్తామంటే ఎలా?
మా నాన్న ఆర్టీసీలో పనిచేశారు. ఆయన జీతం డబ్బుతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు కూలుస్తామంటే ఎలా? అధికారులే అన్ని వసతులు కల్పించి ఇప్పుడు వారే కూలుస్తామని బెదిరిస్తున్నారు. – శిరీష, గండిపేట
మాకెందుకు ఆ ఇళ్లు?
మా ఇళ్లు కూల్చేసి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామంటున్నారు. మాకెందుకు ఆ ఇళ్లు? లండన్‌ను చూసి మూసీని అభివృద్ధి చేస్తానంటే ఎలా? తదుపరి దశలో మా ప్రాంత ఇళ్లు కూలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. టీవీ చూడాలంటేనే భయమేస్తోంది. – రాజు, హైదర్‌షాకోట్
Comments
Please login to add a commentAdd a comment