ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో మాయాజాలం
ఎస్‌టీఓలకు తెలియకుండానే చెల్లింపులు
ఐఎఫ్‌ఎంఎస్‌పై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఎస్) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్‌ను స్థానిక అధికారులు క్లియర్ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్‌లైన్ పద్ధతిలో ఈ–కుబేర్ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్ కమిటీ నుంచి గత నవంబర్ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్ నంబర్ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్ చేశారు.
అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 25న చెక్‌ను మళ్లీ సబ్మిట్ చేస్తే.. రామన్నపేట ఎస్‌టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్ (నం. 251940047) ఎస్‌టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్‌ట్రెజరీ అధికారి (ఎస్‌టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ గెజిటెడ్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment