sto
-
ఒకే బిల్లు.. చెల్లింపులు రెండు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు నిధుల కటకట ఉండగా, ప్రతీ పనికి ప్రభుత్వం ఒక వైపు ఆచితూచి ఖర్చు పెడుతుంటే.. మరోవైపు రాష్ట్ర ట్రెజరీ విభాగం మాత్రం ఒకే చెక్కుకు రెండేసి చొప్పున చెల్లింపులు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ప్రైవేటు కంపెనీతో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఎస్) అమలు చేయిస్తోంది. దీనిపై ఐదేళ్లుగా ఉద్యోగులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఎస్టీఓ పరిధిలో ఒకే మొత్తానికి సంబంధించి ఒక చెక్‌ను స్థానిక అధికారులు క్లియర్ చేయగా, అదే చెక్‌ను స్థానిక అధికారుల ప్రమేయం లేకుండానే ఆన్లైన్ పద్ధతిలో ఈ–కుబేర్ నుంచి చెల్లించేశారు. వివరాల్లోకి వెళితే వలిగొండ మార్కెట్ కమిటీ నుంచి గత నవంబర్ 22న వచ్చి న రూ.30,65,987 (టోకెన్ నంబర్ : 2438538332) మొత్తాన్ని ఖజానాలో సరిపోను నగదు లేని కారణంగా ఈ ఏడాది మార్చి 31న రిజెక్ట్ చేశారు. అదే మొత్తం కోసం తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ 25న చెక్‌ను మళ్లీ సబ్మిట్ చేస్తే.. రామన్నపేట ఎస్టీఓ అనుమతితో మే 30న రూ.30,65,987 మొత్తాన్ని సంబంధిత అకౌంట్‌కు బదిలీ చేశారు. మళ్లీ అదే మొత్తానికి సంబంధించి మరో చెక్ (నం. 251940047) ఎస్టీఓ ప్రమేయం లేకుండానే మరో రూ.30,65,987 మొత్తాన్ని అదే అకౌంట్‌కు బదిలీ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన రామన్నపేట సబ్‌ట్రెజరీ అధికారి (ఎస్టీఓ).. ఉన్నతాధికారులకు నివేదించి, ఆపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఐడీ, పాస్‌వర్డ్‌లను వాడుకుని ఖాతాల నుంచి చెల్లింపులు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎంప్లాయీస్ గెజిటెడ్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
మాటు వేసి మెరుపు దాడి
ఏలూరు అర్బన్ : ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇళ్లపై దాడులు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్‌ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన గెడ్డం విజయ గణేష్‌బాబు ఇంటితో పాటు ఏకకాలంలో ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తూ ఏలూరు అమీనాపేటలో నివాసం ఉంటున్న గెడ్డం విజయ గణేష్‌బాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని నెలరోజుల కిందట ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దాంతో కొంతకాలంగా మాటు వేసిన అధికారులు గణేష్ బాబు ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించే పని ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడికి నగరంలోని అమీనాపేటలో నివాసం ఉంటున్న చిన్న ఇంటితో పాటు శనివారపుపేటలో మూడంతస్తుల భవంతి, తంగెళ్లమూడిలో నిర్మాణంలో ఉన్న మరో మూడు అంతస్తుల భవనం, శనివారపుపేటలో ఇంకో భవంతి కలిగి ఉన్నారని నిర్ధారించుకున్నారు. దీంతో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ, యూజే విల్సన్‌లు సిబ్బందితో కలిసి శనివారం విజయగణేష్ నివాసం ఉంటున్న ఇంటితో పాటు శ్రీరామ్‌నగర్‌లో నిందితునికి చెందిన మూడంతస్తుల భవనం, జంగారెడ్డిగూడెంలో ఎస్టీవోగా పనిచేస్తూ టూటౌన్, సుబ్బమ్మాదేవి హైస్కూల్ వద్ద నివాసం ఉంటున్న నిందితుని స్నేహితుడు బసవరాజు ఇంటిపై, తాడేపల్లిగూడెంలో నిందితుని అత్త వారింటిపై ఏకకాలంలో దాడులు చేశారు. రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు ఐదు చోట్ల జరిపిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్లు విలువ చేసే పలు స్థిరాస్తులు, కీలక డాక్యుమెంట్లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులతో పాటు విలువైన పలు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నిందితుడిపై చాలాకాలంగా నిఘా పెట్టి అతని ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించిన అనంతరం పక్కా ప్రణాళికతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో స్థిరాస్థులతో పాటు నిందితుని ఇంటిలో, గన్నవరంలోని ఆయన కార్యాలయంలో పలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వా«ధీనం చేసుకున్నామన్నారు. అదే క్రమంలో ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పత్రాలను నిందితుడు వడ్డీ వ్యాపారం చేస్తూ రుణదాతల నుంచి హామీగా స్టాంపు పేపర్లు, ఖాళీ బ్యాంక్ చెక్‌లు తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. వీటి ఆధారంగా నిందితుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఏలూరులో నిందితుని పంజాబ్ నేషనల్ బ్యాంకు లాకర్లో దాచిన కేజీ వెండి వస్తువులు, సుమారు 400 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. -
పాల కల్తీ కేంద్రాలపై ఎస్వోటీ దాడులు
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాల తయారీ కేంద్రాలపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీల పేరుతో పాల కల్తీకి పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 80 లీటర్ల పాలు, ఖాళీ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
డబ్బులిస్తేనే.. పీఆర్సీ
భువనగిరి : దేవుడు వరమచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పరిస్థితి. భువనగిరి ఎస్టీఓ పరిధిలోని భువనగిరి పట్టణం, భువనగిరి మండలం, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం మండలాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వేతన స్థీరీకణ కోసం ఎస్టీఓ కార్యాలయంలోని కొందరు అధికారులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్తో ఇచ్చిన పీఆర్సీకి సంబంధించిన అన్ని జీఓలు విడుదల కావడంతో ఈ నెల నుంచి ఏరియర్స్‌తో సహా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాల్సి ఉంది. అయితే భువనగిరి ఎస్టీఓలో బిల్లులు చేయడానికి ప్రధానంగా టీచర్లనుంచి రూ.300 నుంచి రూ.500 డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయుల బాధ్యతను ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. దీంతో వారు టీచర్లను సమావేశపర్చి ఎస్టీఓ కార్యాలయంలో పీఆర్సీ బిల్లుల మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారితో బేరాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులను కొందరు టీచర్లు ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే ఐదేళ్లకోసారి పీఆర్సీ వస్తుంది కదా.. ఖర్చులు ఉంటాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతుండడం గమనార్హం. వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు వేతన స్థిరీకరణ ఆన్లైన్ నమోదు కోసం ముందస్తుగానే రెండు వందల రూపాయలు చెల్లించినా మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేందుకు తాము సానుకూలంగా లేమనే కారణంతో వివిధ సాకులు చూపి వేతన స్థిరీకరణ బిల్లులను పెండింగ్‌లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎస్టీఓ, డ్రాయింగ్ డిస్బర్స్ ఆఫీసర్లు కుమ్మక్కై ఈ తతంగాన్ని తెరలేపారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రధానోపాధ్యాయులు కూడా వ్యతిరేకిస్తుండడంతో వారి బిల్లులు చేయడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు రావాల్సిన పీఆర్సీని అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న ఎస్టీఓ కార్యాలయ అధికారులపై ఏసీబీకీ ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.