మాటు వేసి మెరుపు దాడి
మాటు వేసి మెరుపు దాడి
Published Sat, Mar 4 2017 12:07 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
ఏలూరు అర్బన్ : ఏసీబీ అధికారులు శుక్రవారం ఓ అధికారి ఇళ్లపై దాడులు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్‌ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్న జిల్లాకు చెందిన గెడ్డం విజయ గణేష్‌బాబు ఇంటితో పాటు ఏకకాలంలో ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో సబ్ ట్రెజరీ అధికారిగా పనిచేస్తూ ఏలూరు అమీనాపేటలో నివాసం ఉంటున్న గెడ్డం విజయ గణేష్‌బాబు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని నెలరోజుల కిందట ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దాంతో కొంతకాలంగా మాటు వేసిన అధికారులు గణేష్ బాబు ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించే పని ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడికి నగరంలోని అమీనాపేటలో నివాసం ఉంటున్న చిన్న ఇంటితో పాటు శనివారపుపేటలో మూడంతస్తుల భవంతి, తంగెళ్లమూడిలో నిర్మాణంలో ఉన్న మరో మూడు అంతస్తుల భవనం, శనివారపుపేటలో ఇంకో భవంతి కలిగి ఉన్నారని నిర్ధారించుకున్నారు. దీంతో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐ, యూజే విల్సన్‌లు సిబ్బందితో కలిసి శనివారం విజయగణేష్ నివాసం ఉంటున్న ఇంటితో పాటు శ్రీరామ్‌నగర్‌లో నిందితునికి చెందిన మూడంతస్తుల భవనం, జంగారెడ్డిగూడెంలో ఎస్‌టీవోగా పనిచేస్తూ టూటౌన్, సుబ్బమ్మాదేవి హైస్కూల్ వద్ద నివాసం ఉంటున్న నిందితుని స్నేహితుడు బసవరాజు ఇంటిపై, తాడేపల్లిగూడెంలో నిందితుని అత్త వారింటిపై ఏకకాలంలో దాడులు చేశారు.
రూ.10 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు
ఐదు చోట్ల జరిపిన దాడుల్లో అధికారులు రూ.10 కోట్లు విలువ చేసే పలు స్థిరాస్తులు, కీలక డాక్యుమెంట్‌లు, ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులతో పాటు విలువైన పలు విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోపాలకృష్ణ మాట్లాడుతూ నిందితుడిపై చాలాకాలంగా నిఘా పెట్టి అతని ఆస్తులకు సంబంధించి వివరాలు సేకరించిన అనంతరం పక్కా ప్రణాళికతో దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో స్థిరాస్థులతో పాటు నిందితుని ఇంటిలో, గన్నవరంలోని ఆయన కార్యాలయంలో పలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్‌లు, కీలక పత్రాలు స్వా«ధీనం చేసుకున్నామన్నారు. అదే క్రమంలో ఖాళీ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పత్రాలను నిందితుడు వడ్డీ వ్యాపారం చేస్తూ రుణదాతల నుంచి హామీగా స్టాంపు పేపర్లు, ఖాళీ బ్యాంక్ చెక్‌లు తీసుకుని ఉంటారని భావిస్తున్నామన్నారు. వీటి ఆధారంగా నిందితుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఏలూరులో నిందితుని పంజాబ్ నేషనల్ బ్యాంకు లాకర్‌లో దాచిన కేజీ వెండి వస్తువులు, సుమారు 400 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.
Advertisement
Advertisement