భువనగిరి : దేవుడు వరమచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ
పరిస్థితి. భువనగిరి ఎస్‌టీఓ పరిధిలోని భువనగిరి పట్టణం, భువనగిరి మండలం, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం మండలాలలకు చెందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వేతన స్థీరీకణ కోసం ఎస్‌టీఓ కార్యాలయంలోని కొందరు అధికారులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌తో ఇచ్చిన పీఆర్‌సీకి సంబంధించిన అన్ని జీఓలు విడుదల కావడంతో ఈ నెల నుంచి ఏరియర్స్‌తో సహా రెగ్యులర్ వేతనాలు ఇవ్వాల్సి ఉంది.
అయితే భువనగిరి ఎస్‌టీఓలో బిల్లులు చేయడానికి ప్రధానంగా టీచర్లనుంచి రూ.300 నుంచి రూ.500 డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం మండల పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయుల బాధ్యతను ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. దీంతో వారు టీచర్లను సమావేశపర్చి ఎస్‌టీఓ కార్యాలయంలో పీఆర్‌సీ బిల్లుల మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారితో బేరాలు ఆడుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులను కొందరు టీచర్లు ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నిస్తే ఐదేళ్లకోసారి పీఆర్‌సీ వస్తుంది కదా.. ఖర్చులు ఉంటాయి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతుండడం గమనార్హం.
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
వేతన స్థిరీకరణ ఆన్‌లైన్ నమోదు కోసం ముందస్తుగానే రెండు వందల రూపాయలు చెల్లించినా మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇచ్చేందుకు తాము సానుకూలంగా లేమనే కారణంతో వివిధ సాకులు చూపి వేతన స్థిరీకరణ బిల్లులను పెండింగ్‌లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎస్‌టీఓ, డ్రాయింగ్ డిస్బర్స్ ఆఫీసర్లు కుమ్మక్కై ఈ తతంగాన్ని తెరలేపారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రధానోపాధ్యాయులు కూడా వ్యతిరేకిస్తుండడంతో వారి బిల్లులు చేయడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు రావాల్సిన పీఆర్‌సీని అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న ఎస్‌టీఓ కార్యాలయ అధికారులపై ఏసీబీకీ ఫిర్యాదు చేయాలన్న ఆలోచనలో కొందరు ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
డబ్బులిస్తేనే.. పీఆర్‌సీ
Published Mon, May 11 2015 11:53 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement