సాక్షి, హైదరాబాద్: కోవిడ్ నియంత్రణకు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అభివృద్ధి చేసిన మొడెర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ ఎస్.లాంగర్ ఈ ఏడాదికిగాను జినోమ్‌వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 24 నుంచి 26 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న 20వ బయో ఆసియా సదస్సులో ఆయనకు ఈ అవార్డు అందించనున్నట్లు బయో ఆసియా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని డేవిడ్ హెచ్.కోచ్ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకుడైన రాబర్ట్ ఎస్.లాంగర్... వ్యాధుల చికిత్సకు మందులను నియంత్రిత పద్ధతుల్లో అందించే వ్యవస్థలను అభివృద్ధి చేశారు. వాటిని ప్రస్తుతం కేన్సర్ సహా పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. లాంగర్ ల్యాబ్స్ డైరెక్టర్‌గా ఆయన చేసిన పరిశోధనల కారణంగానే తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ తయారైంది.
2010లో లాంగర్ స్థాపించిన కంపెనీ మొడెర్నా కోవిడ్–19 నియంత్రణకు టీకా తయారు చేయడం తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ ప్రైజ్ ఫర్ ఇంజినీరింగ్‌తోపాటు అనేక ఇతర అవార్డులను అందుకున్న రాబర్ట్ ఎస్.లాంగర్ ఇప్పటివరకూ దాదాపు 1,500 పరిశోధన వ్యాసాలను ప్రచురించారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు రాబర్ట్ ఎస్.లాంగర్ అన్ని విధాలుగా అర్హుడని, ఆయన పరిశోధనలు రానున్న కాలంలోనూ సమాజంపై ప్రభావం చూపనున్నాయని తెలంగాణ మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment