హైదరాబాద్‌లో గోల్డ్‌మెన్‌ సాక్స్‌ విస్తరణ ప్రణాళిక | Goldman Sachs expansion plan in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో గోల్డ్‌మెన్‌ సాక్స్‌ విస్తరణ ప్రణాళిక

Aug 24 2023 1:39 AM | Updated on Aug 24 2023 1:39 AM

Goldman Sachs expansion plan in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకింగ్, ఫైనాన్స్‌ సేవలు, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో హైదరాబాద్‌ను అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సేవల్లో పేరొందిన మాస్‌ మ్యూచువల్, హెచ్‌ఎస్‌బీసీ, స్టేట్‌ స్ట్రీట్, బెర్కాడియా వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్‌ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున తమ కార్యకలాపాలు విస్తరించాయన్నారు.

గోల్డ్‌మెన్‌ సాక్స్‌ విస్తరణ ప్రణాళికలతో బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో హైదరాబాద్‌ స్థానం మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్‌ తెలిపారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా 2,500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభిస్తాయంటూ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌తో న్యూయార్క్‌లోని గోల్డ్‌మెన్‌ సాక్స్‌ కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, సీఈఓ డేవిడ్‌ ఎం.సోలమన్‌ బృందంతో బుధవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న వెయ్యిమంది ఉద్యోగుల సంఖ్యను రెండు రెట్లు పెంచి మరో రెండు వేల మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తుంది. దీనికోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని విస్తరిస్తుంది.

సంస్థ బ్యాంకింగ్‌ సేవలు, బిజినెస్‌ అనలిటిక్స్, ఇంజనీరింగ్‌ వంటి వివిధ రంగాల్లో గోల్డ్‌మెన్‌ సాక్స్‌ సంస్థ కార్యకలాపాల బలోపేతానికి ఈ నూతన కేంద్రం పనిచేస్తుంది. సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లోనూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్‌మెన్‌సాక్స్‌ సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement