ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల సాక్షిగా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వరి్ధల్లుతుందని కాంగ్రెస్ సర్కారు తరఫున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి.. హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోందని చెప్పారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని.. వారి విజ్ఞతను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.
పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని.. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పేందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనుభవం, యువరక్తం మేళవింపుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని తమిళిసై ఆకాంక్షించారు.
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..
‘‘ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచి్చన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కలి్పంచే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోంది. ఇది ప్రజాపాలన. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే పాలన తెలంగాణలో మొదలైందనడానికి నిదర్శనంగా ప్రారంభమైనదే ప్రజావాణి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే మహాలక్షి్మ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు.. ఈ రెండు గ్యారంటీల అమలు ప్రారంభమైంది. మొత్తం ఆరు గ్యారంటీలైన మహాలక్షి్మ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతలను వచ్చే 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. అన్నీ అమలు చేస్తాం. సాధ్యమైనంత త్వరలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. 250 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని, గౌరవ భృతిని అందజేస్తాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది.
ఆదిలాబాద్‌కు సాగునీరు ఇస్తాం..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతలోపం, అవినీతి, అవకతవకలపై విచారణ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి ఎగువన ఆదిలాబాద్, ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా సాగుతాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దానికి జాతీయ హోదా సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతాం.
త్వరలో మెగా డీఎస్సీ
మెగా డీఎస్సీ నిర్వహణతో వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్‌పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.లక్ష, స్థలం లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇంటి స్థలం ఇస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రారంభించేలా త్వరలో కార్యాచరణ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూసంస్కరణలలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన 25లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం.
మాఫియాపై ఉక్కుపాదం
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియాను నిర్మూలించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. డ్రగ్స్ విషయంలో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఐటీ విషయంలో మరింత వేగంగా పురోగతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరాన్ని అన్నిదిశలా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం సంకల్పం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా భావిస్తూ.. ఔటర్ లోపల ఉన్న నగరం, ఔటర్ రింగురోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగురోడ్డు మధ్య ఉన్న ప్రాంతం, రీజనల్ రింగు రోడ్డు ఆవల ఉన్న ప్రాంతం.. ఇలా మూడు ప్రాంతాలను నిర్ధారించి వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
అప్పుల్లో విద్యుత్ సంస్థలు
గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. రూ.50,275 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీని సరిదిద్ది గాడిలో పెట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలపై భారం మోపకుండానే ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి సంక్షేమ పాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
వ్యక్తుల కోసం విధ్వంసమా?
ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితికి దిగజారాయి. ఈ తీరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో విలువలు పునరుద్ధరిస్తాం. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటాం. అభివృద్ధి విషయంలో వివక్ష ఉండదు. పారీ్టలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి నిధులు పొందుతారు. సచివాలయం అలంకారప్రాయంగా ఉండదు. రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ కేలండర్ విషయంలో కార్యాచరణ ప్రారంభిస్తాం. ప్రతి గ్రామం యూనిట్‌గా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం..’’ అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
కాళోజీ, అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ..
‘‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె భారతాన..’’ అన్న ప్రజాకవి కాళోజీ మాటలను ఉటంకిస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చివరిగా ‘‘ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ పాలనా రూపం మాత్రమే కాదు.. వాస్తవానికి అది తోటి మానవుల పట్ల గౌరవాదరాలతో కూడిన ఒక వైఖరి..’’ అన్న అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. ప్రముఖ కవి దాశరథి పేర్కొన్న ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..’’ అనే మాటలతో ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment