సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో, టీఎస్‌పీఎస్సీ నూతన ఛైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయ్యింది.
వివరాల ప్రకారం.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. గత సంవత్సరం డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఆ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆయన లేఖ రాశారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసి నెల రోజులు గడుస్తున్నా.. గవర్నర్ వాటిని ఇంత వరకు ఆమోదించడం లేదని అన్నారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ లేకపోవడంతో ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ బుధవారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు.
దిగజారిన ప్రతిష్ట
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్‌పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. 2021 మే 21వ తేదీన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగింది.
అయితే గతేడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఆ ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరుసగా దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటలు జారీ చేస్తూ వచి్చంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో ఇంటిదొంగలు తయారయ్యారు.
గ్రూప్–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీసుల కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షల రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. క్రమంగా పరిస్థితులు కాస్త సద్దుమణగడం, పరీక్షల పునర్ నిర్వహణ తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు. ఇక, తెలంగాణలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత సభ్యులు కూడా రాజీనామా చేశారు. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment