బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చిక్కుముడి వీడింది. ఉభయ సభలను ఉద్దేశిస్తూ గవర్నర్ చేసే ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం హైకోర్టు వరకు వెళ్లినా.. ఇరువర్గాల మధ్య ఒప్పందంతో సద్దుమణిగింది. కోర్టు సూచనల మేరకు.. బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి ఇచ్చేలా, సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అంగీకరించేలా ఏర్పాటు జరిగింది. రాష్ట్ర బడ్జెట్ 2023–24 సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇరువర్గాల విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ పిటిషన్‌లో వాదనలను ముగించింది.
ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్
రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ గడువు సమీపిస్తున్నా బడ్జెట్‌కు గవర్నర్ నుంచి ఆమోదం రాలేదు. దీంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలంటూ ఈనెల 21వ తేదీనే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొంది.
వెంటనే అనుమతి ఇచ్చేలా రాజ్‌భవన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా లంచ్ మోషన్‌లో విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల ధర్మాసనానికి అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సోమవారం ఉదయం విజ్ఞప్తి చేశారు.
అయితే ‘‘గవర్నర్ విధుల్లో కోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చా? నోటీసులు ఇవ్వవచ్చా? కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటున్నాయని మీరే చెప్తుంటారు కదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. మధ్యాహ్నం విచారణకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే హాజరై దీనిపై వివరణ ఇస్తారని ఏజీ వివరించారు. ఈ మేరకు ధర్మాసనం మధ్యాహ్నం విచారణ చేపట్టగా.. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదన వినిపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమే సుప్రీం..
‘‘బడ్జెట్ అనేది కోట్లాది మంది ప్రజలతో ముడిపడిన సున్నితమైన అంశం. దీనిపై గవర్నర్, సర్కార్ మధ్య ప్రతిష్టంభన సరికాదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రభుత్వమే సుప్రీం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల సందర్భంగా వెల్లడించింది. కారణం లేకుండా బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడం సరికాదు. గవర్నర్ రాజ్యాంగానికి లోబడి ఉండాలి, ప్రభుత్వంతో కలసి పనిచేయాలే తప్ప.. సమాంతర ప్రభుత్వాన్ని నడపకూడదు. వ్యక్తిగతంగా తీసుకోకూడదు.
ఓ పార్టీ చెప్పిన వాటిని వినకూడదు’’ అని దవే పేర్కొన్నారు. ఇక గవర్నర్ కార్యాలయం తరఫున వాదన వినిపించేందుకు సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. భోజన విరామంలో ఇరువర్గాల న్యాయవాదులు చర్చించుకోవాలని సూచించింది.
ప్రభుత్వ తీరు సరిగా లేదు..
అశోక్ ఆనంద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం లేదు. బడ్జెట్ ఫైల్ పంపాలని గవర్నర్ కోరినా సీఎంవో నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. గవర్నర్ ప్రసంగం ఉంటుందా, ఉండదా? అనేది కూడా చెప్పడం లేదు. గత ఏడాది కూడా గవర్నర్ ప్రసంగం లేదు. గణతంత్ర వేడుకలకు సీఎం హాజరుకాలేదు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌పై మంత్రులు అనుచిత, అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారు.
మహిళ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాటిని సీఎం తప్పుబట్టడం లేదు. రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకలను కూడా కోర్టు ఆదేశాలతో జరపాల్సి వచ్చింది. ఎట్ హోంకు సీఎంను పిలిచినా రాలేదు. ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ప్రభుత్వానికి రాజ్‌భవన్ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవు..’’ అని పేర్కొన్నారు. అయితే ఇలాంటి వాటిని ఖండించాల్సిందేనని, సీఎం దృష్టి తీసుకెళ్తానని దవే వివరణ ఇచ్చారు.
ఇరువర్గాల ఒప్పందంతో..
ధర్మాసనం సూచన మేరకు భోజన విరామ సమయంలో న్యాయవాదులు ప్రభుత్వం, రాజ్‌భవన్‌తో మాట్లాడి, చర్చించుకున్నారు. ఈ వివరాలను కోర్టుకు తెలిపారు. తమ సమస్య పరిష్కారమైందని వివరించారు. ‘‘మంత్రి వెళ్లి గవర్నర్‌ను ఆహ్వానిస్తారు. గవర్నర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపాలి. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగం కాపీని చదవాలి. పెండింగ్ బిల్లులపైనా చర్చ జరిగింది. న్యాయపరమైన అంశాలుంటే సంబంధిత అధికారులు వివరణ ఇస్తారు.’’ అని దుష్యంత్ దవే కోర్టుకు చెప్పారు.
బడ్జెట్‌కు ఆమోదం తెలిపేలా గవర్నర్ కార్యాలయం చర్యలు తీసుకుంటుదని అశోక్ ఆనంద్ వెల్లడించారు. ఈ పిటిషన్‌లో వాదనలను ముగించాలని ఇద్దరు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విచారణ ముగిస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. మొత్తంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదానికి తెరపడింది.
Comments
Please login to add a commentAdd a comment